ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’ (Jayaho BC Program) కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమ వివరాలను తెదేపా (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని.. తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో తెదేపా నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వివరించారు.
‘‘వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించింది. 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేసింది. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది. ఆదరణ పథకాన్ని రద్దు చేసింది. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని నా పాదయాత్రలో చెప్పారు. 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు.. నిధులు.. విధుల్లేవు. జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టింది. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
బీసీ సోదరుల తరఫున పోరాడుతున్న తెదేపా బీసీ నేతలపై కేసు పెట్టి వేధించారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెనాయుడుపై అక్రమ కేసులు పెట్టారు. ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు నందం సుబ్బయ్యను చంపేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దుకాణం ధ్వంసం చేశారని శ్రీకాళహస్తిలో ముని రాజమ్మ చెప్పింది. బీసీలు బలహీనులు కాదు.. బలవంతులన్నదే తెలుగుదేశం నినాదం. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమే. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చాం. తెదేపా అధికారంలో వచ్చాక బీసీలకు శాశ్వత కుల ద్రువీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –