గతేడాది సరికొత్త చిహ్నం (నిశాన్)తో ముందుకొచ్చిన భారత నౌకాదళం (Indian Navy).. తాజాగా అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీల (Epaulettes)ను విడుదల చేసింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు. అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రేయర్ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం అయిదు బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. భుజానికి ధరించే ఈ బ్యాడ్జీ.. అధికారి స్థాయిని చూపిస్తుంది.
బ్యాడ్జీపై ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలోని చిహ్నం.. ఎనిమిది దిక్కుల్లో నౌకాదళ దార్శనికతను సూచిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది, నౌకాదళ చిహ్నం నుంచి దీన్ని తీసుకున్నారు.
అష్టభుజాకారం మీద ‘నౌకాదళ చిహ్నం’తో కూడిన బంగారు బటన్‌ను పొందుపర్చారు. బానిసత్వ మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది చాటుతుంది.
కింద ఖడ్గం, టెలిస్కోప్‌లు ఉన్నాయి. భారత సరికొత్త శక్తిసామర్థ్యాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ‘ఖడ్గం’ సూచిస్తుంది. దూరదృష్టిని ‘టెలిస్కోప్’ ప్రతిబింబిస్తుంది. ఇక అధికారుల ర్యాంకును బట్టి నక్షత్రాల సంఖ్య, బ్యాడ్జీ అంచు రంగు ఉంటుంది.
భారత నౌకాదళానికి సరికొత్త చిహ్నాన్ని (నిశాన్) ప్రధాని మోదీ గతేడాది సెప్టెంబరులో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఉన్న గుర్తు.. దేశ వలసవాద గతాన్ని గుర్తుచేసేలా ఉందని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే మన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందేలా కొత్త చిహ్నాన్ని రూపొందించింది. ఇదిలా ఉండగా.. సముద్ర జలాలు, తీరాలపై ఆధిపత్యం చెలాయించిన భారత రాజుల్లో శివాజీ ఒకరు. ఆయన అత్యంత విశ్వసనీయమైన నౌకాదళాన్ని నిర్మించారు. ఇందులో 60 ‘యుద్ధ నౌకలు’, దాదాపు 5వేల మంది సైన్యం ఉండేవారని నేవీ గతంలో ఓ వీడియోలో తెలిపింది. భారత తీర రక్షణలో ఈ దళం అత్యంత కీలకంగా పనిచేసింది.
👉 – Please join our whatsapp channel here –