జిల్లాలో కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మాంసాహారం తర్వాత ఎక్కువగా తినే గుడ్డును కొనేందుకు వెళ్తే అకస్మాత్తుగా పెరిగిన ధరలే కనిపిస్తున్నాయి. గతంలో డజన్ కోడిగుడ్లు రూ.66కు రాగా నేడు రూ.84కు చేరింది. అంటే ఒక్క గడ్డు ధర రూ.7 పలుకుతోంది. వారంలోనే డజన్ రూ.18 పెరగడంపై వినియోగదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
పెరుగుదలకు కారణం..
ఇటీవల కోళ్ల దాణా ధరలు పెరిగాయి. గతంలో కిలో రూ.15 నుంచి రూ.17 వరకు ఉండేది. ప్రస్తుతం ఒక్కసారి రూ.28కి పెరిగింది. కోళ్ల దాణా ఖర్చులు పెరగడంతో గుడ్డు ధరలు పెంచాల్సి వచ్చిందని కోళ్ల ఫారాల నిర్వాహకులు తెలిపారు. గతంలో గుడ్డుకు రూ.5.25 ధర పలికితే తమకు గిట్టుబాటు అయ్యేదని, దాణా ధరలు పెరగటం, డిమాండ్‌కు తగ్గట్లు గుడ్ల ఉత్పత్తి కాకపోవటంతో కొరత ఏర్పడింది. దీంతో కోడిగుడ్లకు ధర పెంచక తప్పటంలేదని చెబుతున్నారు.
భారమవుతున్న రవాణా
యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పౌల్ట్రీ ఫాంలు పదుల సంఖ్యలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కోడిగుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా వ్యాపారులు రంగారెడ్డి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, మహారాష్ట్ర నుంచి గుడ్లను తీసుకొస్తున్నారు. అక్కడ ఒక గుడ్డు రూ.5.30 పైసలు పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో రూ.7కు విక్రయిస్తున్నారు. జిల్లాలో రోజుకు 15 నుంచి 20 లక్షల కోడిగుడ్ల విక్రయాలు సాగుతుంటాయని, ఇలాగే కొరత సాగితే ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –