ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ‘గృహలక్ష్మి’ పథకానికే దాదాపు 15.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం జాగ ఉన్నవారికి ఇంటి కోసం రూ.5 లక్షలు, జాగ లేనివారికి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఎన్ని దరఖాస్తులు వస్తాయో అనేది అంచనాకు దొరకడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఎలా అనేదానిపై ఇంకా మార్గాదర్శకాలు కూడా సిద్ధం కాలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు చేస్తున్నది.
ఇందులో ఇందిరమ్మ ఇండ్ల అంశం అత్యంత ప్రధానమైనదిగా చెప్పవచ్చు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం విధితమే. జాగలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించిన గత సర్కారు, దరఖాస్తులు ఆహ్వానించగా, 15,58,610 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సుమారు 11 లక్షల దరఖాస్తులకు అర్హతలున్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 2 లక్షలకుపైగా మంజూరు పత్రాలను కూడా అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు జాగలు ఉన్నవారు, జాగలు లేనివారు అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు ఇంకా సిద్ధంకాలేదు. ఇందిరమ్మ ఇల్లు కింద ఆర్థిక సాయం పొందేందుకు ఎంత జాగ ఉండాలి? ఇంటి జాగతోపాటు ఇంటికోసం ఆర్థిక సాయం పొందాలంటే ఉండాల్సిన అర్హతలేమిటి? ఇంటి జాగ ఒకచోట ఉండి, ఉద్యోగరీత్యా మరోచోట స్థిరపడినవారి పరిస్థితి ఏమిటి? లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేస్తారు? ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని మంజూరు చేస్తారు? జాగ లేనివారికోసం ఒకవేళ స్థానికంగా ప్రభుత్వ భూమి లేకుంటే.. భూసేకరణ చేస్తారా? తదితర అనేక అంశాలపై మార్గదర్శకాలు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశమున్నది.
👉 – Please join our whatsapp channel here –