Politics

తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి?

తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి?

వ్యూహం చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు. ‘‘ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి సినిమాలకు జగనే డబ్బులు పంచుతున్నారు. దర్శకుడు ఆర్జీవీ తరఫున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నదీ వైకాపా ఎంపీ నిరంజన్ రెడ్డే. ఈ న్యాయవాదులను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నాం. ఆర్జీవీ నిజంగా సినిమా తీయాలంటే హూకిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్‌లో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చు’’ అని చెప్పారు.

వారి పేర్లే రెడ్‌బుక్‌లో..
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్‌బుక్‌లో రాస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ‘‘అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి.. అదే చదువుతా. లేదా సజ్జల వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్లు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారా? రెడ్‌బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్లకెలా తెలుసు?’’ అని నిలదీశారు.

ఓడిపోయే సీట్లనే బీసీలకు వైకాపా ఇస్తోంది..
వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లనే వైకాపా బీసీలకు ఇస్తోందని లోకేశ్‌ విమర్శించారు. వైకాపాలో తమకు గుర్తింపు లేదని వైకాపా బీసీ ఎమ్మెల్యే పార్థసారథి ఆవేదన చెందారన్నారు. ‘‘మంగళగిరిలో రెండు సార్లు రెడ్డిలకే టికెట్‌ ఇచ్చారు. ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వమనండి. పులివెందుల సీటు బీసీలకు ఎందుకివ్వరు?. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనీ చెత్త అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు. చిలకలూరిపేటకు పనికి రాని విడదల రజనీ గుంటూరు వెస్ట్‌లో ఎలా పనికొస్తారు? ఓ నియోజకవర్గంలోని చెత్త .. మరో నియోజకవర్గంలో బంగారం అవుతుందా?’’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z