రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సాయం రాదా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. రైతుభరోసాకు రేషన్ కార్డును లింక్ చేసే దిశగా చర్యలు చేపట్టడమే అందుకు కారణం. ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ‘గ్యారెంటీ’ దరఖాస్తులకు రేషన్ కార్డు ప్రతిని జత చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. దాని ప్రకారమే దరఖాస్తులో రేషన్ కార్డు నంబర్, రైతుభరోసా కాలమ్ ఉన్నాయి. దీన్ని బట్టే పెట్టుబడిసాయానికి, రేషన్ కార్డుకు లింక్ చేస్తారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతిసారి సీజన్‌కు ముందుకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారి నుంచి ఆయా ఏఈవోలు దరఖాస్తులు స్వీకరించి వారి పేర్లను రైతుబంధు జాబితాలో చేర్చుతారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాకు కొత్త రైతుల ఎంపికను ప్రత్యేకంగా రేషన్‌కార్డుతో సంబంధం ఉన్నటువంటి గ్యారెంటీల దరఖాస్తులో చేర్చింది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిసింది.
కార్డు లింక్ చేస్తే 7.5 ఎకరాలకే కటాఫ్!
ఆహార భద్రత నిబంధనల ప్రకారం తెల్ల రేషన్‌కార్డు పొందాలంటే తడి భూమి 3.5 ఎకరాల వరకు, మెట్ట భూమి 7.5 ఎకరాల వరకు ఉండాలి. అంటే ప్రస్తుతం తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్నవారికి గరిష్ఠంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతుభరోసాకు తెల్ల రేషన్‌కార్డును లింక్ చేస్తే 7.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు మాత్రమే పెట్టుబడి సాయానికి అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా రేషన్‌కార్డు నిబంధనలకు కాస్త అటుఇటుగా భూ పరిమితి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రైతుబంధులో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 8 నుంచి 54 ఎకరాల వరకు సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరి వద్ద 26 లక్షల ఎకరాల భూమి ఉన్నది. వీరికి సుమారు రూ.13 కోట్ల వరకు రైతుబంధు అందుతున్నది. అయితే 8 ఎకరాల్లోపు రైతుల్లోనూ రేషన్‌కార్డు లేని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారు రేషన్‌కార్డు లేకపోతే రైతుభరోసా ఇవ్వరా? అని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే సీఎం, మంత్రుల సంకేతాలు
తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతుభరోసాలో భూ పరిమితికి మద్దతుగానే తన వైఖరిని వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆ పార్టీ మంత్రి సీతక్క, సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతుభరోసా పరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద భూస్వాములకు, పాడుపడ్డ భూములకు రైతుబంధు ఇస్తున్నారని, దీన్ని కచ్చితంగా సవరిస్తామని స్పష్టం చేశారు. గ్యారెంటీల దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగానూ రైతుభరోసా పరిమితిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించటంతో దీనిపై జోరుగా చర్చ జరుగుతున్నది. అయితే ఈ యాసంగి సీజన్‌కు నిబంధనల్లో మార్పులు చేర్పులకు సమయం లేకపోవటంతో ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధు పంపిణీ చేస్తున్నది. వానకాలం సీజన్ నాటికి భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.7,500 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అంటే ప్రస్తుతం ఏటా రూ.15 వేల కోట్లు అవసరం అవుతుండగా, ఇక నుంచి రూ.22,500 కోట్లు అవసరం కానున్నాయి. అయితే ఇంత ఆర్థిక భారం మోయడం ప్రభుత్వానికి ఇబ్బందికరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతుభరోసాకు పరిమితులు విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
👉 – Please join our whatsapp channel here –