Business

అమృత్ భారత్ రైళ్లు ఏపీ స్టాప్‌లు ఇవి

అమృత్ భారత్ రైళ్లు ఏపీ స్టాప్‌లు ఇవి

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. కొత్త రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’గా నామకరణం చేశారు.

శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్‌ ఇండియా టెక్నికల్, ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(రైట్స్‌) అభివృద్ధి చేసింది.

రెండు అమృత్‌ భారత్‌ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌ నుంచి అయోధ్య మీదుగా బీహార్‌లోని దర్బంగా వరకూ ప్రయాణించనుండగా.. రెండో పశ్చిమబెంగాల్‌లోని మాల్దా టౌన్‌ నుంచి బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ మధ్య నడవనుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుంది. అయితే, ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుంది. జనవరి 7 నుంచి రెగ్యులర్‌గా నడవనుంది.

ఈ సూపర్‌ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో 22 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో 12 నాన్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ స్లీపర్‌ క్లాస్‌లు, 8 జనరల్‌ అన్‌రిజర్వుడ్‌ కోచ్‌లతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన లగేజీ రాక్‌లు, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్‌లు, ఎల్‌ఈడీ లైట్లు పబ్లిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌, సీసీ టీవీ, పరిశుభ్రత, ఆధునిక టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేశారు.

ఈ రైళ్లలో ఒక కి.మీ నుంచి 50 కి.మీ లోపు ప్రయాణానికి కనీస టికెట్‌ ధర రూ.35గా నిర్ణయించారు. టికెట్‌ ఛార్జీలు ఇతర మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. దానికి రిజర్వేషన్‌ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అమృత్ భారత్ రైళ్లు గరిష్టంగా 130 కి.మీ వేగంతో పరుగులు పెట్టనుంది. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్‌ ధర రూ.35గా ఉంటుంది.

మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రామమందిర శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ శనివారం అయోధ్యలో పర్యటిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z