పిట్టను కొట్టబోతే పొరపాటున గులేరులో ఉన్న రాయి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాకిందని, తన తప్పేమీ లేదని జనగామ అంబేడ్కర్ నగర్‌కు చెందిన హరిబాబు(60) మొరపెట్టుకున్నారు. వందేభారత్ మీద రాళ్లు విసిరిన కేసులో హరిబాబును శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు కథనం ప్రకారం.. జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు. ఇందులో భాగంగా జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరుతో ప్రయత్నించినప్పుడు పొరపాటున రాయి వెళ్లి అప్పుడే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న 20833 నంబరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తగలడంతో అద్దం పగిలింది. కేసు నమోదు చేసి సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. గులేరును సీజ్ చేసి ఆయనను అరెస్టు చేశారు.
👉 – Please join our whatsapp channel here –