Business

ఐటీశాఖ సరికొత్త మైలురాయి-వాణిజ్య వార్తలు

ఐటీశాఖ సరికొత్త మైలురాయి-వాణిజ్య వార్తలు

* ఐటీశాఖ సరికొత్త మైలురాయి

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 మదింపు సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను (ITR) రిటర్నులు దాఖలైనట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శుక్రవారం నాటికి 8 కోట్ల మందికి పైగా రిటర్నులు దాఖలు చేశారని ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. 2022-23 మదింపు సంవత్సరంలో మొత్తం 7,51,60,817 రిటర్నులు దాఖలయ్యాయని అధికారిక ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించింది. దీంతో ఐటీశాఖ సరికొత్త మైలురాయిని చేరుకుందని వెల్లడించింది.గత ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ ఫైల్ చేయని వారు ‘బిలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆఖరు తేదీ 2023, డిసెంబర్ 31. ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారు అందులో ఏవైనా తప్పులుంటే ఈ తేదీలోపు తిరిగి రివైజ్డ్‌ రిటర్న్ ఫైల్ చేసి సరిదిద్దుకోవచ్చు. తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్‌లో నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. రివైజ్డ్‌ రిటర్నులు దాఖలు చేసేందుకు ఎలాంటి ఆలస్య రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.

*   ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ

ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మైయర్స్ ప్రస్తుతం ఈ పేరును ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని తీరాలి. ఈ ఫ్రెంచ్ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది. మైయర్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. ఆమె సంపద 100 బిలియన్ డాలర్లను దాటింది. ప్రపంచంలోనే ఇంత డబ్బు సంపాదించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మహిళ కూడా 100 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించలేకపోయింది. భారతదేశంలో ఏ ధనవంతుడు ఆమె కంటే ముందు లేరు. ఆమె ప్రపంచంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల కంపెనీ లోరియల్ వారసురాలు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె 12వ స్థానంలో నిలిచింది. మైయర్స్ L’Oréal వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్ మనవరాలు. మైయర్స్ ఆమె కుటుంబం L’Oréalలో 34 శాతం వాటాను కలిగి ఉన్నారు.L’Oréal 1909లో స్థాపించబడింది. ఈ ఏడాది L’Oréal షేర్లలో విపరీతమైన పెరుగుదల ఉంది. కరోనా మహమ్మారి ముగిసిన తర్వాత, లగ్జరీ కాస్మోటిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరిగింది. దీని కారణంగా 2023లో కంపెనీ షేర్లు 35 శాతం మేర పెరిగాయి. విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన మైయర్స్ వయస్సు 70 సంవత్సరాలు. ఆమె తన తల్లి లిలియన్ బెటెన్‌కోర్ట్ నుండి ఈ వాటాలను పొందారు. లిలియన్ యూజీన్ షులర్ కుమార్తె. ఫ్రాంకోయిస్ బెటాన్‌కోర్ట్ మైయర్స్ టెథిస్ చైర్‌పర్సన్. ఆమె భర్త జీన్-పియర్ మైయర్స్ ఈ కంపెనీకి CEO. ఆమె కుమారులు జీన్-విక్టర్ మైయర్స్, నికోలస్ మైయర్స్ కూడా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. L’Oréalలో Tethys అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ బిలియనీర్ మహిళ L’Oréal గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్ కూడా.మైయర్స్ తల్లి లిలియన్ బెటాన్‌కోర్ట్ కూడా 2017 వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ. తాను 2017లో మరణించింది. ఫ్రాంకోయిస్ బెటాన్‌కోర్ట్ మైయర్స్ కు తన తల్లి మధ్య వివాదాలున్నాయి. కానీ, ఆమె అతని ఏకైక వారసురాలు అయింది. ఫ్రాంకోయిస్ ఆమె గోప్యతకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఆమె ప్రతిరోజూ తన కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తుంది. ఆమెకు గంటల తరబడి పియానో వాయించడం అంటే ఇష్టం.మైయర్స్ సంపద భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ. మెక్సికో ప్రముఖ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు కార్లోస్ స్లిమ్ కంటే కొంచెం తక్కువ. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ సంపద 232 బిలియన్ డాలర్లు. మైయర్స్ దేశానికి చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి. బెర్నార్డ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ యజమాని.

ఎయిర్‌ ఏషియా సీఈవో రాజీనామా

ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆపరేటర్ ఎయిర్‌ ఏషియా బెర్హాడ్‌ (AirAsia Berhad) మలేషియా యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియాద్ అస్మత్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ఎయిర్‌లైన్‌లో నాయకత్వంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తోంది. కారణమిదేనా?రియాద్ అస్మత్ 2018 జనవరిలో ఎయిర్‌ ఏషియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బోర్డులో సలహాదారుగా మారాలనే యోచనతో ఆయన సీఈవోగా వైదొలగడానికి సిద్ధమయ్యారు. అస్మత్ నిష్క్రమణ ప్రకటనలో గల కారణాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు లేవు. అయితే ఎయిర్‌ ఏషియా ఏవియేషన్ గ్రూప్ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సిబ్బంది మార్పులపై రాబోయే అప్‌డేట్‌లను ఇది తెలియజేస్తోంది.బడ్జెట్ ఎయిర్‌లైన్ సెక్టార్‌లో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్‌ ఏషియా ఏవియేషన్ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లను, రానున్న మహమ్మారి నేపథ్యంలో తలెత్తే ఒడిదుడుకులను అధిగమించడానికి ఈ సంస్థాగత మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియాద్ అస్మత్‌ తన నైపుణ్యం, అనుభవాన్ని కంపెనీ కోసం మరింతగా వినియోగించేందుకు సలహాదారుగా మారుతున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

* బీమా క్లెయింల పరిష్కారంలో సాటిలేని ఎల్‌ఐసీ

బీమా క్లెయింల పరిష్కారంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) అగ్రస్థానంలో ఉంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 98.5 క్లెయింలను సెటిల్‌ చేసినట్టు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) వెల్లడించింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఎల్‌ఐసీ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి 98.7 శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. ఐఆర్‌డీఏ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ప్రైవేటు జీవితబీమా సంస్థల సెటిల్‌మెంట్‌ రేషియో సైతం 98.1 శాతం నుంచి 98 శాతానికి దిగింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 12.5 లక్షల క్లెయింలు రాగా, బీమా కంపెనీలు 12.4 లక్షల క్లెయింలు పరిష్కరించాయి. గ్రూప్‌ క్లెయింల్లో ఎల్‌ఐసీ దాదాపు 99 శాతం సెటిల్‌ చేసింది. ప్రైవేటు సంస్థలు 99.4 శాతం సెటిల్‌ చేశాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా వ్యాపారంలో సరెండర్లు/విత్‌డ్రాయిల్స్‌ 25.6 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో ఎల్‌ఐసీ చెల్లించినవే 56.3 శాతం పాలసీలు ఉన్నాయి. మొత్తం జీవిత బీమా పరిశ్రమ పాలసీదార్లకు చెల్లించిన ప్రయోజనాల విలువ రూ. 5 లక్షల కోట్ల వరకూ ఉన్నది. ఇది నికర ప్రీమియం ఆదాయంలో 64 శాతం. వ్యక్తిగత జీవిత బీమా వ్యాపారంలో 10.8 లక్షల డెత్‌ క్లెయింలు రాగా, కంపెనీలు 10.6 లక్షల క్లెయింలను పరిష్కరించి రూ. 28,611 కోట్లు చెల్లించాయి.

ఓ కస్టమర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన స్విగ్గీ

కొత్త ఏడాది ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక సంస్థలు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. తాజాగా నిత్యావసర సరుకులు అందించే సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ (Swiggy Instamart) కూడా తన కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ బహుమతులు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఓ కస్టమర్‌కు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తన కస్టమర్లతో ‘ఎక్స్‌’ ద్వారా ముచ్చటించింది. ‘ఈ ఏడాదిలో మీ బకెట్ లిస్ట్‌లో పూర్తి కాని అంశాన్ని మాతో పంచుకోండి. దాన్ని నెరవేర్చటానికి ప్రయత్నిస్తాం’ అంటూ సంస్థ ‘ఎక్స్‌’ లో పోస్ట్‌ చేసింది. దీంతో పెద్ద ఎత్తున యూజర్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. అందులో హిమాన్షు బన్సల్‌ అనే వ్యక్తి ‘నేను నిజంగా ఈ ఏడాది హాట్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని కామెంట్‌ చేశాడు. ఈ ఫన్నీ కామెంట్‌ని ఎంపిక చేసిన సంస్థ ఆ కస్టమర్‌కు నచ్చినట్లుగానే బహుమతి అందించాలని ప్లాన్‌ చేసింది. దీని కోసం ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌, పూల దండలను సిద్ధం చేసి డెలివరీ బాయ్‌తో ఇంటికి పంపింది.హిమాన్షు డోర్‌ తెరవగానే ఇంటిబైట మ్యూజిక్‌ బ్యాండ్‌ సందడి కనిపించటంతో అతనికి ఏం అర్థం కాలేదు. తర్వాత డెలివరీ బాయ్‌ వచ్చి పూల హారం వేసి ‘రూమ్‌ హీటర్‌’ను చేతిలో పెట్టాడు. దాన్ని చూసిన కస్టమర్‌ ఆశ్చర్యపోయి నవ్వుతూ తన బహుమతిని స్వీకరించాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టామార్ట్‌ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. అంతే ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 41వేల మంది వీక్షించారు. ఇన్‌స్టామార్ట్‌ చేసిన పనికి చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z