DailyDose

సీఎంకు లోకేశ్‌ బహిరంగ లేఖ-తాజా వార్తలు

సీఎంకు లోకేశ్‌ బహిరంగ లేఖ-తాజా వార్తలు

కోలా జనార్ధన్‌ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు కోలా జనార్దన్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కోలా జనార్దన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎంకు లోకేశ్‌ బహిరంగ లేఖ

తక్షణమే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ సీఎం జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.‘‘మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10లక్షల పరిహారం ఇచ్చారా? కనీసం పరామర్శించారా? ఇదేనా మీ మానవత్వం. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ విషయంలో తెదేపా ప్రభుత్వంపై, నాపై చేసిన ఆరోపణలు.. చిమ్మిన విషం ఇంకా మరిచిపోలేదు. నాటి సీఎం వైఎస్‌ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్‌ ఆయన హయాంలోనే స్కామ్‌ చేసింది. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ ఆస్తులు 21వేల ఎకరాలు అటాచ్‌ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేశాం. అయినా, మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక వైకాపా చేసిన మోసంతో రోడ్డునపడిన అగ్రిగోల్డ్‌ బాధితులు యువగళం పాదయాత్రలో నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు’’ అని లోకేశ్‌ లేఖలో పేర్కొన్నారు.

* మరోసారి మానవత్వం చాటుకున్న రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన కాన్వాయ్ మధ్యలో నుంచి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. శనివారం ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే క్రమంలో కేబీఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ అటుగా రావడం కనిపించింది. ఇది గమనించిన సీఎం అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు దారిచ్చింది.అటుగా వెళుతున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దంటూ సీఎం ఇదివరకే అధికారులను ఆదేశించారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

అయోధ్య‌లో ఎయిర్‌పోర్టును ప్రారంభించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్‌షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాన మంత్రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కోసం అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేయనున్నారు. విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్‌షో మార్గంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ప్రధానికి చేతులెత్తి స్వాగతం పలికారు. మోడీ తన కారు నుంచి ప్రజలను పలకరించారు. ఒక సమయంలో, వారి వైపు తిరిగి పలకరించడానికి తన వాహనం తలుపు తెరిచారు. ప్రజలు పూలమాలలు కురిపించి ఆయనను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు.దారి పొడవునా సాంస్కృతిక బృందాల ప్రదర్శనలను కూడా ప్రధాని వీక్షించారు. ప్రారంభోత్సవాలతో పాటు, కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి ఋషి కవి మహర్షి వాల్మీకి పేరు పెట్టబడుతుందని, దీనిని ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్’ అని పిలుస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో.. “అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశ 1,450 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడింది. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించనుంది.”

బ్యాంక్‌ అకౌంట్‌ మళ్లీ అడుగుతారా? 

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటించి, ఓపికతో ఉండి.. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుందని అన్నారు. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని సూచించారు.హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి రూ.4వేలకు పెంచి.. ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ మళ్లీ అడుగుతారా? లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్‌ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానా ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు 500 గ్యాస్‌ సిలిండర్‌ వర్తిస్తుందా? లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్‌

కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (vijayakanth) అంత్యక్రియల్లో రజనీకాంత్ కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో అక్కడున్న వారంతా కూడా భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం తుదిశ్వాస విడిచిన విజయకాంత్‌ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. తన మిత్రుడిని చివరిసారి చూసిన రజనీకాంత్‌ వారి అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.‘‘విజయకాంత్ మరణించారని తెలిసి నా హృదయం ముక్కలైంది. ఆయన మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు. గొప్ప సంకల్పశక్తి ఉన్న వ్యక్తి. చివరిసారిగా అతడిని డీఎండీకే మీటింగ్‌లో చూశాను. కోలుకున్నందుకు ఎంతో ఆనందించా. విజయకాంత్‌ నాకు మంచి స్నేహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే స్నేహానికి ప్రతిరూపం. ఒక్కసారి అతడితో స్నేహం చేస్తే ఎవరూ మర్చిపోలేరు. అతడి కోసం చాలామంది తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కోపం వెనుక కూడా సరైన కారణం ఉంటుంది. స్వార్థానికి చోటుండదు’’.‘‘మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. నేను ఒకసారి ఆసుపత్రిలో ఉంటే నన్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారు. వాళ్లను నియంత్రించడం ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల వల్ల కూడా కాలేదు. కానీ, విజయకాంత్‌ వాళ్లందరినీ 5 నిమిషాల్లో కంట్రోల్ చేశాడు. ఆ సమయంలో ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. చివరి రోజుల్లో ఆయన్ను చూడడానికి నాకు వీలుకాలేదు. వేలమంది పుడుతూ మరణిస్తూ ఉంటారు. కానీ, విజయకాంత్ లాంటి వాళ్లు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

కాకినాడ పర్యటనలో జనసేన సమీక్షా సమావేశాలు

కాకినాడ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇదే సమయంలో.. ఇతర పార్టీల నేతలను కూడా కలుస్తున్నారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు.. అయితే, పవన్‌ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ సమావేశంలో జనసేనాని ముందు కీలక ప్రతిపాదన పెట్టాడట ఎమ్మెల్యే చంటిబాబు.. కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ ను కోరారట జగ్గంపేట ఎమ్మెల్యే..టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటును జనసేనకి కేటాయించడం ఖాయమన్న చంటిబాబు.. ఆర్థికంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ తనకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతిపాదన పెట్టారట.. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు జనసేనలో కాకినాడ ఎంపీగా పోటీ చేసేవారు ప్రస్తుతానికి ఎవరూ లేరని.. ఎవరు పోటీ చేసిన బయట నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేయడం తప్పదని పవన్ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారట.. దీంతో ఆలోచనలో పడిపోయిన జనసేనాని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారట.. వనరుల విషయంలో ఎటువంటి డోకా లేదని తన వియ్యంకుడు తనకంటే 100 రెట్లు ఆస్తి ఉన్నవాడని పవన్‌ కల్యాణ్‌తో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా.. మొదట టీడీపీతో టచ్‌లోకి వెళ్లిన జ్యోతుల చంటిబాబు.. ఆ తర్వాత జనసేన వైపు మళ్లారు.. పవన్‌తో కలిసి చర్చలు జరపడం ఇప్పుడు కాకినాడ జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

పవన్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

పేదలందరికీ భూమి పేరుతో రూ. 35,141 కోట్ల మేర దోపిడి జరిగిందని, ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. దీంతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మూర్తి స్పందించారు. ముందుగా పవన్ కల్యాణ్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు. 35 వేల కోట్ల కుంభకోణం జరిగిందనడానికి పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు అసలు సిస్టమ్‌ అంటే ఏందో తెలియదన్నారు. చంద్రబాబు వద్ద ఉడిగం చేయడానికి పవన్ సిద్ధమయ్యారని విమర్శించారు. జగసేన అభ్యర్థులను గెలుపించుకోవాలనే ఆలోచన పవనకు లేదన్నారు. ఉదయం ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. సాయంత్రం చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకోవడమే పవన్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం పవన్‌కు లేదని మండిపడ్డారు. 35 వేల కోట్ల స్కాం అంటే మాట్లాలా అని ప్రశ్నించారు. పవన్ తింగరి మాటలు మాట్లాడటం మానుకోవాలని డిప్యూటీ సీఎం గట్టు సత్యనారాయణ హెచ్చరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z