ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య (Ayodhya)లో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ (Ayodhya railway station)ను ప్రధాని ప్రారంభించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరులు ఉన్నారు. రైల్వే స్టేషన్ విశేషాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రధానికి వివరించారు.
8 రైళ్లకు పచ్చజెండా..
అనంతరం ప్రధాని మోదీ రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ భారత్ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. పర్యటనలో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం అనంతరం ఎయిర్‌పోర్టు పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో ప్రసంగిస్తారు.
అమృత్ భారత్ ఫీచర్లివే..
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ రైలు పుష్-పుల్ రైలు. ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతోపాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్‌లు ఉంటాయి. 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్ కాగా.. 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఈ 2 కంపార్ట్‌మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
15 కిలోమీటర్ల మెగా రోడ్ షో..
ఈ ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –