Business

అంధుడు…అయినా అందరికీ ఆదర్శుడు

ఆంధ్రుడు…అయిన అందరికీ ఆదర్శకుడు

బలమైన సంకల్పం నీకుంటే సమస్తం నీకు దాసోహమంటుంది.. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా నీ గమ్యం చేరుకునే దిశలో అడుగులు వేస్తే.. తప్పకుండా సక్సెస్ నీకు సలాం చేస్తుంది. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువమందిలో ఒకరు ‘భవేష్ భాటియా’. చూపు లేకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రూ.350 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన ‘భవేష్ భాటియా’కు చిన్నప్పటి నుంచి టెక్నాలజీ, సృజనాత్మకత వంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ అతనికి రెంటీనా కండరాల సంబంధిత వ్యాధి వల్ల, దానిని నయం చేసుకోవడానికి డబ్బు లేకపోవడం వల్ల చూపును కోల్పోయాడు.

ఉద్యోగం లభించలేదు
డిగ్రీ పూర్తి చేసినప్పటికీ.. చూపులేకపోవడం వల్ల ఎవరూ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించలేదు. తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న భాటియా తల్లి కూడా క్యాన్సర్ వ్యాధిలో మరణించింది. భాటియా తండ్రి పొదుపు చేసుకున్న మొత్తం డబ్బుని భార్య వైద్య ఖర్చుల కోసం ఖర్చు చేసేసాడు.

రూ. 50 అప్పుగా
కంటికి రెప్పలా చూసుకునే తల్లి కోల్పోయిన తరువాత ఎదో ఒకటి చేయాలని నిరాంయించుకుని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ స్కూల్‌లో చేరి క్యాండిల్స్ (కొవ్వొత్తులు) తాయారు చేయడం నేర్చుకున్నాడు. క్యాండిల్స్ తయారు చేయడంలో కొంత నైపుణ్యం వచ్చిన తరువాత స్నేహితుడి నుంచి రూ.50 అప్పుగా తీసుకుని బండిని అద్దెకు తీసుకుని, మహాబలేశ్వర్‌లోని స్థానిక మార్కెట్‌లో కొవ్వొత్తులను అమ్మడం ప్రారంభించారు.

వ్యాపారం కొంత పెరగడం మొదలు పెట్టింది. ఆ తరువాత ‘నీతా’ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత భాటియా జీవితంలో కొత్త వెలుగు రావడం మొదలైంది. కొవ్వొత్తులను మార్కెటింగ్ చేయడంలో నీతా చాలా సహాయపడింది. భాటియా బలమైన సంకల్పంతో ముందడుగులు వేస్తున్న సమయంలో కొన్ని ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది.

‘సన్‌రైజ్ క్యాండిల్స్‌’కు పునాది
వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక బ్యాంక్ నుంచి రూ.15000 లోన్ తీసుకుని కొత్త పద్దతులతో క్యాండిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనలాంటి అంధులకు కొంత మద్దతుగా నిలిచి వారికి ఉపాధి కల్పించాడు. ఆ సమయంలోనే ‘సన్‌రైజ్ క్యాండిల్స్‌’కు పునాది వేసాడు. ఈ సంస్థ నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ఉంది.

ప్రస్తుతం సన్‌రైజ్ క్యాండిల్స్‌ సంస్థ ఏకంగా సంవత్సరానికి రూ.350 కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ఈ కంపెనీ క్యాండిల్స్ ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. సాధారణ క్యాండిల్స్ మాత్రమే కాకుండా.. సువాసనలు వెదజల్లేవి, మంచి డిజైన్ కలిగిన క్యాండిల్స్ తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

9000 మందికి ఉపాధి
కేవలం రూ. 50తో మొదలై రూ. 350 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగి, ఏకంగా 9000మంది అంధులకు అందమైన జీవితాన్ని భాటియా ప్రసాదించారు. సుమారు 52 ఏళ్ల భాటియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 కంపెనీలకు 12,000 రకాల డిజైన్ చేసిన క్యాండిల్స్ విక్రయిస్తున్నారు.

ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా భవేష్ భాటియా అకుంఠిత దీక్షను ప్రశంసించారు, అతని జీవితం ఎంతోమందికి ఆదర్శమని వెల్లడించారు. ఒకప్పుడు చూపు లేకపోవడం వల్ల ఉద్యోగం ఇవ్వని వారు సైత శభాష్ భాటియా అని పొగుడుతున్నారు. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మాట ఖచ్చితంగా భాటియాకు సరిపోతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z