DailyDose

కోడికత్తి కేసు నిందితుడి తల్లి వేదన

కోడికత్తి కేసు నిందితుడి తల్లి వేదన

సీఎం జగన్‌పై దాడి కేసులో తన కుమారుడికి బెయిల్‌ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారని కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్లుగా ఏడుస్తూనే ఉన్నానని, కుమారుడు లేకపోవడంతో బతుకు దుర్భరంగా మారిందన్నారు. మాల మహాసభ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది సలీం మాట్లాడుతూ.. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి సీఎం జగన్‌ అయిదేళ్లుగా కోర్టుకు రావడం లేదని, దాడిపై ఆయన ఇచ్చిన వాంగ్మూలం తప్పన్నారు. జగన్‌ కోర్టుకి వస్తే.. కేసు కొలిక్కి వస్తుందన్నారు.

మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లె వెంకట్రావు మాట్లాడుతూ.. కేకులు కోసే కత్తితో జరిగిన దాడిని కోడికత్తి కేసుగా ప్రచారం చేసింది వైకాపానేనని, శ్రీనుకు బెయిల్‌ రాకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మాల, మాదిగలపై పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం ఎత్తివేసిందని, అలాగే కోడికత్తి కేసునూ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘జగన్‌ కోర్టుకు రావాలి.. సాక్ష్యం చెప్పాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. జనవరి 18న తెదేపా, భాజపా, జనసేన, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో సంఘీభావ సమావేశాలు, 19న విజయవాడలో నిరసన దీక్షలు చేయాలని తీర్మానించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z