సామాజిక న్యాయ యాత్ర అంటూ వైకాపా చేపట్టిన కార్యక్రమంలో జనం ఉండడం లేదు…అదే సమయంలో పార్టీలో ఒక ప్రధాన వర్గం మితిమీరిన ఆధిపత్యాన్ని తట్టుకోలేక బీసీ నేతలు, రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లభించని బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు చెందిన నేతలూ..ఇలా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీలో అంతటా బీసీల జపం.. పార్టీ అధినేత జగన్ మొదలుకొని అందరూ బీసీలకే మా ప్రాధాన్యమంటున్నారు. కానీ, ఇవన్నీ మాటలకే…పార్టీలో, ప్రభుత్వంలో పెత్తనమంతా ఒక ప్రధాన సామాజికవర్గ పెద్దలదే. ‘సామాజిక న్యాయ యాత్ర’ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను రోడ్డెక్కించారు. ఈ వర్గాలకు చెందిన వారిలో ఎవరికి సీట్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ‘పెద్ద’లు కూర్చొని నిర్ణయిస్తున్నారు. వైకాపా ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ధనుంజయరెడ్డి(ముఖ్యమంత్రి కార్యదర్శి) అభ్యర్థుల జాబితాను సన్నద్ధం చేసి తుది ఆమోదం కోసం జగన్ ముందుంచుతున్నారు.
యాత్రకు జనం స్పందన లేదు..
‘సామాజిక న్యాయ యత్ర’ పేరుతో వైకాపా చేపట్టిన బస్సు యాత్రలో జనం ఉండడం లేదు. ఏ వర్గాల లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టారో ఆ వర్గాలు అటువైపు రావడం లేదు. రుణమాఫీ డబ్బులు ఇవ్వబోమని బెదిరించి డ్వాక్రా మహిళలను ఈ సభలకు తీసుకువస్తున్నారు. విధిలేక అక్కడి వరకూ వస్తున్న మహిళలు సభావేదిక వద్ద సెల్ఫీ తీసుకుని వెళ్లిపోతున్నారు. నాయకులు తీరిగ్గా ఖాళీ కుర్చీల ముందే ప్రసంగించాల్సి వస్తోంది. వైకాపా ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో చేసిందేమీ లేకపోవడంతో నేతలు వారి ప్రసంగాల్లో ఏమీ చెప్పలేక తమకు పదవులు ఇచ్చారంటూ ముఖ్యమంత్రికి జేజేలు పలికేందుకే పరిమితమవుతున్నారు. మీకు పదవులు వస్తే..జనానికి ఒరిగిందేంటి అని అక్కడికి వస్తున్న వైకాపా కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
బీసీ నేతలు ఉక్కిరిబిక్కిరి
పార్టీలో బీసీ నేతలూ ఇబ్బంది పడుతున్నారు.. బీసీల్లో కీలకమైన ‘యాదవ’వర్గానికి చెందిన నేతలు పార్టీలో తమ దైన్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే పార్టీని వీడగా.. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి లాంటి నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ‘ఆస్తులు అమ్ముకుని..పార్టీ కోసం పనిచేసి..మా సామాజికవర్గ మద్దతును పార్టీకి కూడగట్టా..ఇంత చేస్తే నన్ను కనీసం పార్టీలో మనిషిలా కూడా చూడడం లేదు. నా వ్యాపారాలను దెబ్బతీశారు. జరిగిన నష్టం గురించి మొరపెట్టుకునేందుకు కలుస్తామంటే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు’ అని విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైకాపాకు గుడ్‌బై చెప్పారు. వంశీ సామాజికవర్గానికే చెందిన మరో బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిస్థితి మరీ దారుణం. ఆయన సొంత నియోజకవర్గం గురజాలలో ఆయనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి పక్కనపెట్టారు.. ఇప్పుడైనా తన సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నా పార్టీలో పట్టించుకున్నవారే లేరు. ముఖ్యమంత్రిని ఒక్కసారి కల్పించండి మహాప్రభో అని ఆయన ‘పెద్ద’లను వేడుకొనే పరిస్థితి నెలకొందని వైకాపా వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డితో పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన విమర్శలను తట్టుకోలేక కృష్ణమూర్తి కొడుకు జంగా కోటయ్య శనివారం జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు జంగాతోపాటు ఉండే మరో బీసీ నేత గురువాచారికి నాలుగున్నరేళ్లుగా నామినేటెడ్ పదవి అంటూ ఊరిస్తూ మొండిచెయ్యి చూపుతున్నారు.
రాజకీయంగా ప్రాధాన్యం లభించని వర్గాలదీ అదే దారి
రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం లభించని వర్గాలకు చెందిన నేతలూ పార్టీలో ఇమడ లేకపోతున్నారు. దీనికీ పార్టీలో ఒక వర్గం మితిమీరిన ఆధిపత్యమే కారణం. ఈ పెత్తనాన్ని తట్టుకోలేకనే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించేశారు. మరోవైపు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా పార్టీని వదిలేశారు.
మోపిదేవికి నియోజకవర్గం లేనట్లే…!
ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణకు ఇప్పుడు అసలు నియోజకవర్గమే లేకుండా పోయింది. ఆయన సొంత నియోజకవర్గం రేపల్లెలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని సమన్వయకర్తగా నియమించారు. సర్దుబాటు చేసేందుకు ఆయనను సీఎంఓకు పిలిచి ‘మీకు అవనిగడ్డలో అవకాశం ఇస్తాం..అక్కడ పోటీ చేస్తూ..పక్కనే ఉన్న రేపల్లెలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించండి’ అని చెప్పడంతో మోపిదేవి నెవ్వరపోయారు. ‘గెలవలేని వ్యక్తిని తీసుకువచ్చి రేపల్లెలో పెట్టి, ఆయనను కూడా గెలిపించమని మళ్లీ నాకే చెప్పడమేంటి? అదేదో నాకే సీటు కొనసాగించి ఉండొచ్చు కదా’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జగన్ గుర్తించడం లేదని పార్థసారథి ఆవేదన
పెనమలూరు ఎమ్మెల్యే, సీనియర్ బీసీ నేత పార్థసారథి పార్టీలో తనకు అవమానం జరుగుతోందన్న విషయాన్ని ఈ నెల 28న జరిగిన సామాజిక న్యాయ యాత్ర సభలో ఆవేదన చెందుతూ ప్రస్తావించారు. ‘జగన్ నన్ను గుర్తించకపోయినా..పెనమలూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. నా వెంట నిలిచారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైకాపాను కుదిపేశాయి. ‘వైకాపా కార్యాలయాన్ని విజయవాడకు మార్చినప్పుడు తన స్థలంలోనే దాన్ని ఏర్పాటు చేసి..అన్ని ఖర్చులూ భరించారు. ఎంత చేస్తే ఏముంది? బీసీలు, చిన్నవాళ్లను ఎవరు పట్టించుకుంటారు’ అని బీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
డొక్కా ఆవేదన
సీనియర్ దళిత నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వేదన అరణ్య రోదనగా మారింది. అడగకుండానే ఆయనను తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అలా నియమించిన వారం పదిరోజులకే మీరు సమన్వయకర్తగా వద్దు అని ఆపేశారు. తర్వాత మళ్లీ మీరే తాడికొండ అభ్యర్థి అంటూ ముఖ్యనేతల నుంచి సీఎం వరకు డొక్కాకు చెప్పారు. ఇప్పుడు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో డొక్కా అయోమయంలో పడ్డారు. తన పరిస్థితిపై స్పష్టత కోసం సీఎంను కలవాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.. ‘సీఎంను చూసే అవకాశం కల్పించండి సార్ ’అంటూ శనివారం తాడికొండలో జరిగిన సామాజిక న్యాయ బస్సు యాత్రలో డొక్కా పార్టీ పెద్దలను కోరిన తీరు..ఆ పార్టీలో జరుగుతున్న ‘సామాజిక న్యాయానికి’ అద్దం పడుతోంది.
👉 – Please join our whatsapp channel here –