Fashion

టీ ట్రీ ఆయిల్‌తో చుండ్రు పరార్‌

టీ ట్రీ ఆయిల్‌తో చుండ్రు పరార్‌

చలికాలం వచ్చిందంటే చుండ్రు సమస్య వేదిస్తుంది. ఎన్ని రకాల షాంపులు వినియోగించినా చుండ్రు తగ్గదు. యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉపయోగించినా మంచి ఫలితాలు రావు. బదులుగా జుట్టు పొడిబారి మరింత నిర్జీవంగా కనిపిస్తుంది. చుండ్రు నివారణకు టీ ట్రీ ఆయిల్ ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. షాంపూలో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేస్తే, చుండ్రు సమస్య వెంటనే మాయమవుతుంది. టీ ట్రీ ఆయిల్ వినియోగించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, తల దురద వంటి వేల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రును తొలగించి, పొడి స్కాల్ప్‌ను తేమగా ఉండేలా చేస్తుంది. కానీ టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా జుట్టుకు పట్టించకూడదు. అతిగా ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి చుండ్రును వదిలించుకోవడానికి టీ ట్రీ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలో ఇక్కడ పరిశీలిద్దాం..

టీ ట్రీ ఆయిల్‌తో కూడిన షాంపూలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించవచ్చు. లేదంటే ఉపయోగించే షాంపూలో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు.

హెయిర్ ఆయిల్
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల చుండ్రు సమస్య బాధించదు. అంతేకాకుండా, ఆయిల్ మసాజ్ స్కాల్ప్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఏదైనా హెయిర్‌ ఆయిల్‌లో 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది.

హెయిర్ మాస్క్: హెయిర్ మాస్క్ శీతాకాలంలో జుట్టుకు అదనపు తేమను అందిస్తుంది. మార్కెట్లో లభించే ఏదైనా హెయిర్ మాస్క్‌లో టీ ట్రీ ఆయిల్‌ను కలపవచ్చు. లేదా పెరుగు, గుడ్డు, తేనె లేదా ముల్తానీ మట్టితో చేసిన హెయిర్ మాస్క్‌లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ఉపయోగించిన తర్వాత, జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకుంటే సరి.

హెయిర్ స్ప్రే: స్ప్రే బాటిల్‌లో ఒక కప్పు నీటిని తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల, జుట్టు మీద స్ప్రే చేసుకోవచ్చు. జుట్టును బాగా దువ్విన తర్వాత, జుట్టు మూలాలపై ఈ నీటిని స్ప్రే చేయాలి. దీంతో చుండ్రు సమస్య కూడా దూరమవుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z