DailyDose

31 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు- నేర వార్తలు

31 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు- నేర వార్తలు

*   31 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు

ఓ హత్య కేసులో మూడు దశాబ్దాలకుపైగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. 1989లో స్థానికంగా ఓ వ్యక్తి హత్య కేసులో దీపక్‌ నారాయణ్‌ భీసే(62) నిందితుడిగా ఉన్నాడు. 1992లో బెయిల్ మంజూరయ్యింది. అప్పటినుంచి కోర్టు విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే 2003లో కోర్టు అతడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. అతడి ఆచూకీ కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.ఆ సమయంలో నిందితుడి నివాస ప్రాంతమైన కాందివలీకి పోలీసులు వచ్చినప్పుడల్లా.. అతడు చనిపోయి ఉండొచ్చని స్థానికులు తెలిపేవారు. కానీ, పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇటీవల భీసే భార్య ఫోన్ నంబర్‌ను సంపాదించారు. దాన్ని ట్రాక్‌ చేసి, నాలాసొపారా ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో అనేక ప్రదేశాలను మార్చిన అతడు.. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రెండేళ్లుగా ఈ ప్రాంతంలో స్థిరపడినట్లు వెల్లడించారు. చెట్ల నరికివేత పనులు చేపడుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని జైలుకు తరలించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టిన పోలీస్‌

మద్యం మత్తులో ఉన్న పోలీస్ అధికారి కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. నిలదీసిన వాహనదారులపై రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో వాహనదారులు, స్థానికులు అతడ్ని చితక బాదారు. (Drunk Police Officer Thrashed) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్‌ అధికారి అమిత్ కుమార్ తెవాటియా, మీరట్ పోలీస్ కమిషనర్ సెల్వ కుమారికి గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం సివిల్‌ డ్రెస్‌లో ఉన్న అతడు మద్యం సేవించాడు. ఆ మత్తులో వాహనాం నడిపాడు. లాల్‌కుర్తి ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న ఒక మహిళను తొలుత ఢీకొట్టాడు. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ఒక కారుతోపాటు పలు వాహనాలను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి.కాగా, ఆగ్రహించిన వాహనదారులు, స్థానికులు అమిత్ కుమార్‌ను కారు నుంచి బయటకు లాగారు. ఆపై అతడ్ని చితక్కొట్టారు. అయితే తాను పోలీస్‌ అంటూ హంగామా చేశాడు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టి చెత్త డబ్బా వద్ద పడి ఉన్న అమిత్ కుమార్‌ను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

*  కామారెడ్డి జిల్లాలో దారుణం

ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములో విసిరేసిన ఘటన బీర్కూర్‌ మండలంలోని బరంగెడ్గిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్‌ సాయిలుకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు ఇంటి పక్కనే ఆడుకుంటున్నారు. అదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్‌కు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుని దగ్ధమైంది. ‘మీ కుమార్తె అంకిత మా గడ్డివాముకు నిప్పటించింది’ అంటూ గంగాధర్‌.. సాయిలుతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తె అంకితను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన గంగాధర్‌ గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. రెండు కాళ్లు, చెయ్యి కాలడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

శంషాబాద్ లో దారుణం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గాన్సీమియాగుడా గ్రామం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తితో కడుపులో పొడిచి బండరాళ్ళతో మోది హతమర్చారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద దొరికిన ఓ భ్యాగ్ ఆధారంగా మృతుడి వివరాలను తెలుసుకున్నారు. హత్యకు గురైన యువకుడు పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గా గుర్తించారు. కొన్నాల క్రితం భార్య వదిలిపెట్టడంతో శంషాబాద్ ప్రాంతానికి వచ్చి అడ్డాకులిగా మారాడు. అయితే అప్పుడప్పుడు ఝాన్సీమియా కూడా వద్ద ఉన్న టెంట్ హౌస్ లో పనిచేసే పక్కనే ఉన్న ఓ గుడిలో తల దాచుకునేవాడు. అయితే రాత్రి ఘాన్సీమియా గుడా వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన హత్యకు గురై పడి ఉన్నాడు.పోలీసులు హత్యపై ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. హత్య చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మల్లేష్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. భార్యను వదిలేసిన మల్లేష్ ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మల్లేష్ కు బంధువులు ఏమయ్యారు? కుటుంబ సభ్యులు ఎవరు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మల్లేష్ కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మల్లేష్ కు ఎవరితోనైనా విభేదాలు వున్నాయా? వారే మల్లేష్ ను హతమార్చారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మల్లేష్ భార్య ఎక్కడ వుంది? ఆమెను మల్లేష్ మృతి విషయం తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ భారీగా డ్రగ్స్ పట్టివేత

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై జులం విధిల్చారు. సమాచారం అందించే చాలు టక్కున వాలి పోతున్నారు. డ్రగ్స్‌ను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. వారం రోజులుగా హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా డ్రగ్స్ గుర్తించారు. మరికొన్ని గంటల్లో భాగ్యనగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌పై తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ప్లబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ఇలా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో సోదాలు నిర్వహించారు. 100 గ్రాముల కొకైన్‌తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని తెనాలి, ఒంగోలుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు.

రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ కలకలం

రాజేంద్రనగర్‌లో డ్రగ్స్‌ కలకలం చోటుచేసుకుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా పార్టీ కోసం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని వెనుక ఎవరు? ఉన్నారని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను బాలానగర్‌, రాజేంద్ర నగర్‌లో ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సంధ్య ఇంట్లో రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు. కాగా, ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు.ఈ క్రమంలో సంధ్య (26)దగ్గర డ్రగ్స్ ఉండగా, అది తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25), డేవిడ్‌ను ట్రాప్ చేసి ముగ్గురిని ఒకే సారి పట్టుకున్నారు. పది గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీని వెనుక ఎవ్వరూ ఉన్నారు?. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అర్జున్‌ తీసుకువచ్చినట్టు గుర్తించారు.

బ్రేకులు ఫెయిలై బోల్తాపడిన లారీ

బీహార్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఓ రైలు బోగీని మోసుకెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. భగల్‌పూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో జనాల రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇక ఊహించని ఘటన జరగడంతో రోడ్లపై వెళ్తున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీపైన ఉన్న రైలు బోగీని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z