మహాలక్ష్మి పథకంతో టీఎస్‌ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర పరిధిలో టీఎస్‌ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గుతుండగా.. ఆమేరకు ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరుగుతోంది.
300-320 కి.మీ. మేర ఉచితం
హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏపీ నుంచి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు బస్సులు వచ్చి వెళుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రెండు రాష్ట్రాల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్ర చిరునామాతో గుర్తింపు కార్డులు ఉన్న మహిళలకు తెలంగాణ సరిహద్దుల వరకు టీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. దీంతో పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మహిళా ప్రయాణికులు వీలైనంతమేర ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు (180 కి.మీ.) ఉచితంగా, ఆ తర్వాత టికెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పగటి సర్వీసుల్లో ఈ పరిస్థితి ఉంది. కోదాడ వరకు ఉచిత ప్రయాణంతో ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు తగ్గుతోంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, అశ్వారావుపేట వరకు దాదాపు 270-320 కి.మీ. వరకు టీఎస్‌ఆర్టీసీలో ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉంది. అశ్వారావుపేట నుంచి రాజమహేంద్రవరం 100 కి.మీ. దూరమే’’ అని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులపైనా మహాలక్ష్మి పథకం ప్రభావం అధికంగా ఉంది. ‘రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ ప్రాంతాల నుంచి మధిర, సత్తుపల్లి, ఖమ్మం రాకపోకలు సాగించే ఏపీ బస్సులో రద్దీ తగ్గుతోంది’ అని ఆ అధికారి వివరించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ 143 కి.మీ. దూరం కాగా.. ఇందులో 110 కి.మీ.కు పైగా తెలంగాణ పరిధే. దీంతో హైదరాబాద్-బీదర్‌కు రాకపోకల్లో టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది.మరో పది రోజుల్లో ఎక్కువమంది సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణం అవుతారు. హైదరాబాద్ నుంచి ఏపీలో దూరప్రాంతాలైన విశాఖపట్నం, కాకినాడ వంటి నగరాలకు బస్సుల్లో సీట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. తెలంగాణ సరిహద్దులకు తక్కువ దూరం ఉండే విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలకు మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో భారీగా సీట్లు ఖాళీ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రభావంతోనే ఈ పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒంగోలుకు వెళ్లే సర్వీసుల్లో ఒక్కో బస్సులో పదేసి సీట్లు.. విజయవాడకు వెళ్లే బస్సుల్లో సగటున 25కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –