భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా ఖేల్‌రత్న (Khel Ratna), అర్జున అవార్డులను స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) వెనక్కి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా మండిపడ్డారు. యావత్ దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. దేశంలో ప్రతి కూతురికీ ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యం అని.. ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
‘దేశంలోని ప్రతి కూతురికి ఆత్మ గౌరవమే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే ఏదైనా పతకం, గౌరవం వస్తాయి. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ‘బాహుబలి’గా ప్రకటించుకునే వారి నుంచి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? యావత్ దేశానికి ప్రధానమంత్రి సంరక్షకుడు. ఆయన వైపు నుంచి ఇటువంటి ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతోంది’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తన పతకాలను ప్రధాని మోదీకి అందజేసేందుకు (శనివారం) వినేశ్ ఫొగాట్ బయలుదేరిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు వచ్చిన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్న వినేశ్ ఫొగాట్.. వాటిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు శనివారం వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వాటిని కర్తవ్యపథ్ వద్ద వదిలేసింది. అనంతరం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్‌భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్ ఇంతకుముందే ప్రకటించింది. ఇదిలావుండగా డబ్ల్యూఎఫ్ఐని క్రీడా మంత్రిత్వ శాఖ ఇదివరకే సస్పెండ్ చేసింది. సమాఖ్యను నడిపించడానికి తాత్కాలిక కమిటీని అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –