Business

వాహన ప్రియులకు షాక్- వాణిజ్య వార్తలు

వాహన ప్రియులకు షాక్- వాణిజ్య వార్తలు

వచ్చేనెలలో భారత్ మార్కెట్లోకి టెక్నో స్పార్క్20 ప్రో+

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో స్పార్క్ 20 ప్రో + (Tecno Spark 20 Pro+) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. టెక్నో స్పార్క్20 మోడల్ కొనసాగింపుగా టెక్నో స్పార్క్ 20 ప్రో, టెక్నో స్పార్క్ 20సీ ఫోన్లతోపాటు టెక్నో స్పార్క్20 ప్రో + (Tecno Spark 20 Pro+) ఫోన్ వస్తోంది. మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. వర్చువల్‌గా మరో 8జీబీ ర్యామ్ పెంపుతో 16 జీబీ ర్యామ్ వరకూ పొడిగించుకోవచ్చు. 120 హెర్ట్స్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78-అంగుళాల కర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అయితే, భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి మాత్రం ఇంకా వెల్లడించలేదు.టెక్నో స్పార్క్20 + (Tecno Spark 20 Pro+) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వస్తుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.75 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఐపీ53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, స్టీరియో డ్యుయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెచ్ఐ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఇందులో డైనమిక్ పోర్ట్ ఫీచర్ కూడా జత చేస్తారు.

వాహన ప్రియులకు షాక్

దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు ఇప్పటికీ ‘ఇయర్ ఎండ్ 2023’ ఆఫర్స్ కింది అద్భుతమైన డిస్కౌంట్స్ అందించాయి. ఈ ఆఫర్స్ అన్నీ కూడా దాదాపు ఈ రోజుతో ముగియనున్నాయి. రేపటి నుంచి కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో 2024 జనవరి 1 నుంచే వాహనాల ధరలు పెరుగుతాయని ఇప్పటికే చాలా సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఇందులో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాటితో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలు ఉన్నాయి.ఇన్‌పుట్ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీలు ఇదివరకే తెలిపాయి. దీని ప్రకారం ధరల పెరుగుదల 2 నుంచి 3 శాతం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరలు లేదా కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇప్పటికే పలు కంపెనీలు 0.8 శాతం ధరలను ఏప్రిల్ నెలలో పెంచాయి. కాగా ఇప్పుడు మరో సారి పెంచడానికి సన్నద్ధమైపోయాయి. ప్యాసింజర్ కార్ల ధరలు మాత్రమే కాకుండా.. లగ్జరీ కార్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్ల ధరలు పెరగటం వల్ల అమ్మకాలు తగ్గుతాయా? లేదా కార్ల విక్రయాను పెంచడానికి కంపెనీలు ఏమైనా వారంటీలు వంటివి అందిస్తాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా అరవింద్‌ పనగఢియా

16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) ఛైర్మన్‌గా ‘నీతి ఆయోగ్‌’ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగఢియా (Arvind Panagariya)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పనగఢియా ఛైర్మన్‌గా ఈ ఫైనాన్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనం పాండే (Ritvik Ranjanam Pandey) దీనికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఓ ప్రకటనలో పేర్కొంది.ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది. ఇదిలా ఉండగా.. ఫైనాన్స్ కమిషన్ అనేది కేంద్ర- రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇందులో ఒక ఛైర్మన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మిగతా సభ్యుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

*  డజన్ గుడ్లు ఎంతంటే?

నిత్యావసర వస్తువులతో పాటు కోడి గుడ్ల ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ రేట్లు ఎక్కువగా ఉండటంతో కనీసం కోడి గుడ్డు అయినా తిందాం అనుకునేవారికి గుడ్డు భారంగా మారింది. దీంతో ప్రజలు గుడ్డును కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఆ డబ్బులతో కూరగాయలు కొని ఆరగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.వారం రోజుల్లోనే డజన్‌ కోడిగుడ్ల ధర ఏకంగా రూ. 18 పెరిగింది. దీంతో వినియోగదారులు కోడి గుడ్డు ధర తెలుసుకొని వామ్మో అంటున్నారు. గతంలో రూ. 66 ఉన్న డజన్‌ కోడిగుడ్ల ధర, ఇప్పుడు ఏకంగా రూ. 84 కి చేరింది. దీంతో ఒక్క కోడి గుడ్డు ధర రూ. 7 పలుకుతోంది. ఇదిలా ఉంటే కోడి గుడ్డు ధర పెరగడానికి ప్రధాన కారణం కోళ్ల దాణా ధరలు పెరగడమే. గతంలో కిలో రూ.15 నుంచి రూ.17 వరకు ఉన్న కోళ్ల దాణా ధర ప్రస్తుతం ఏకంగా ఒకేసారి రూ.28 కి పెరిగింది. దాణా ధరలు పెరగడమే.. గుడ్ల ధర పెరగడానికి కారణంగా విక్రయదారులు చెబుతున్నారు.

* గౌతమ్‌ అదానీకి షాక్‌

దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్‌ తాజా నివేదికలో వెల్లడించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 9 శాతం లాభపడటంతో ముకేశ్‌ అంబానీ సంపద మరింత పెరగడానికి దోహదం చేసిందని తన నివేదికలో పేర్కొంది. 97.1 బిలియన్‌ డాలర్ల సంపదతో ముకేశ్‌ అంబానీ దేశీయ శ్రీమంతుడిగాను, ప్రపంచ కుబేరుల జాబితాలో 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 మంది శ్రీమంతుల సంపద 1.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగినట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది 1.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నది. వీరిలో ఎలాన్‌ మస్క్‌ అత్యధికంగా 95.4 బిలియన్‌ డాలర్ల సంపదను పోగేసుకున్నారు. 2022లో మాత్రం ఆయన 138 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయిన విషయం తెలిసిందే.గౌతమ్‌ అదానీ సంపద భారీగా కరిగిపోయింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనుమానాలతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్‌ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో 21 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. మరోవైపు, డీ-మార్ట్‌ అధినేత రాధాకృష్ణ దామాని 187 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ ఫౌండర్‌ శివ్‌ నాడార్‌ 9.47 బిలియన్‌ డాలర్లు పెరిగి 34 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. హెచ్‌సీఎల్‌ షేరు ధర 41 శాతం పెరగడమే ఇందుకు కారణం. జిందాల్‌ గ్రూపు చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ సంపద కూడా 8.93 బిలియన్‌ డాలర్లు అందుకొని 24.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్‌ డాలర్లు అధికం కాగా, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ 5.26 బిలియన్‌ డాలర్లు, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ 3.62 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z