Devotional

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు

కేరళ (Kerala)లోని శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి (Ayyappa Swamy) ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం (New Year 2024) తొలి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్‌ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భద్రతను పెంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఇదే తొలిసారని ఆలయ వర్గాలు తెలిపాయి. 2021 జనవరి 1న మధ్యాహ్నానికి సుమారు 18 వేల మంది భక్తులు ఇరుముడులు సమర్పించగా, ఆ తర్వాత 2024, జనవరి 1న భక్తులు రికార్డు స్థాయిలో వచ్చినట్లు వెల్లడించారు. 41 రోజుల మండల పూజ అనంతరం గత నెల 27వ తేదీ రాత్రి ఆలయ ద్వారాలను మూసివేసిన సంగతి తెలిసిందే. అనంతరం శనివారం మకరజ్యోతి ఉత్సవాల కోసం ఆలయం తిరిగి తెరుచుకుంది. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనరారు సమక్షంలో ముఖ్య పూజారి పీఎన్‌ మహేశ్‌ నంబూద్రి శనివారం సాయంత్రం ప్రధాన ఆలయం ద్వారాలను తెరిచారు. జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. భక్తుల కోసం జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంటుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z