వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దృష్టి సారించిన కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్ హస్తం పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల ఎంట్రీపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల వస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనతో చెప్పారని అన్నారు.
షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. అధికార వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో టచ్‌లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునే ఉద్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్నాటక, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వస్తారని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –