డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు కోరగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాధ్యం కాదని మంత్రులు తేల్చి చెప్పారు.
చర్చల అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాన్ పీహెచ్‌సీ కేటగిరీ ఉద్యోగులకు రూ.6వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని వివరించాం. స్కిల్డ్, అన్ స్కిల్డ్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. రోస్టర్, పీఎఫ్ ఖాతాలు, ఎక్స్‌గ్రేషియా అంశాలను పరిష్కరిస్తామని చెప్పాం. మరికొన్ని అంశాలపై మరోమారు చర్చలు జరుపుతాం. అప్పటివరకు సమ్మె విరమించాలని కోరుతున్నాం. సమ్మె ప్రభావం కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే ఉంది. ఇబ్బందులు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం’’ అని మంత్రి వివరించారు.
సమ్మె యథాతథంగా కొనసాగుతుంది: ఉమామహేశ్వరరావు
‘‘ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. బేసిక్ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచనలేదు. కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. మా ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం చర్చించలేదు. సమాన పనికి సమాన వేతనం అని వైకాపా మేనిఫెస్టోలో ఉందని చెప్పినా మంత్రులు పట్టించుకోవడం లేదు. ఉద్యమాన్ని అణచి వేస్తామని ప్రభుత్వం చూస్తే కుదరదు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంచారు. కార్మికులకు మాత్రం వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? మున్సిపాలిటీల్లో నీరు, పారిశుద్ధ్య సేవలు నిలిపివేస్తాం. నిరసన తెలియజేస్తున్న కార్మికులను అరెస్టు చేస్తారా?11 వ పీఆర్సీలో కనీస వేతనాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. పారిశుద్ధ్య పరిస్థితుల పట్ల మేమే ఆందోళన చెందుతున్నాం’’ అని మున్సిపల్ కార్మికుల సంఘం నేత ఉమామహేశ్వరరావు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –