సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే.. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది. అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన, నియామక జాబితాల వెల్లడికి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విద్యాసంవత్సరంలోగా నియామకాలు పూర్తిచేసి, పోస్టింగులు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై..
ఈ పోస్టులకు గతేడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుది కీలు విడుదల చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించింది.
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం!
హైకోర్టు నుంచి స్పష్టత వచ్చినవెంటనే తొలుత డిగ్రీ, తర్వాత జూనియర్ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో జాబితాలు ప్రకటించనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైన రోజు, కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకుని ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యాసంస్థల్లో ప్రవేశాల సందర్భంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశముందని సమాచారం. ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వేసవి సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –