DailyDose

ప్రజలే జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు-తాజా వార్తలు

ప్రజలే జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు-తాజా వార్తలు

* ప్రజలే జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు!

వైకాపా ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్‌ తరఫున షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్టు దుష్ప్రచారం జరుగుతోందన్నారు.‘‘నేను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదు. అప్పుడప్పుడు విజయమ్మను కలిసి కుటుంబ విషయాలు మాట్లాడుతా. మేము రాయబారాలు చేయాల్సిన పనిలేదు. ప్రజలే జగన్‌ను మరోసారి ఆశీర్వదించి సీఎం చేస్తారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారో.. లేదో సమాచారం లేదు. ఆమె కాంగ్రెస్‌లో చేరినా వైకాపాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వైకాపా నష్టపోకుండా చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నాం. వాస్తవ పరిస్థితులు, వేర్వేరు కారణాలతోనే సీట్ల మార్పు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నష్టపోకుండా ఉండేందుకే ఈ మార్పులు.వైకాపా ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీలు మారుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అందరికీ న్యాయం చేయడం సాధ్యపడదు. గెలుపు అవకాశాలు, అభ్యర్థిపై వ్యతిరేకత మేరకు సీట్ల మార్పు ఉంటుంది. ఎన్ని స్థానాల్లో మార్పులుంటాయనేది ఇప్పుడే చెప్పలేం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

జపాన్‌ భూకంపం ఘటనపై ఎన్టీఆర్‌ దిగ్భ్రాంతి

జపాన్‌ (Japan)ను వరుస భూకంపాలు (Earthquakes) వణికించిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 155 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి ప్రాణనష్టం తక్కువే అయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా. కాగా, జపాన్‌లో వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ గతవారం కుటుంబంతో కలిసి వెకేషన్‌ కోసం జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్‌ జపాన్‌లో వారం రోజులపాటు గడిపారు. ఇక టూర్‌ ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌.. సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘జపాన్‌ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. గతవారం అంతా అక్కడే గడిపాను. జపాన్‌లో భూకంపం వార్త విని షాక్‌ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఆఫర్‌

 వైఎస్‌ షర్మిల తన వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం పార్టీ కార్యకర్తలతో ఆమె కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తనకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును ఆఫర్‌ చేసిందని నేతలతో వెల్లడించారు. అలాగే తనకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు చెప్పారు. దీనికి ఆమెను ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరినట్లు ఆమె తెలిపారు.కాగా, వైఎస్‌ఆర్‌టీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ రోజు వైఎస్ షర్మిలతో పార్టీ సమావేశంలో 60 నుంచి 70 మంది ఉన్నారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి దాదాపు 20 నుంచి 30 మంది హాజరవుతారు, అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే జనవరి 8న రాజ్యసభ సభ్యత్వంపై చర్చిస్తానని వైఎస్‌ఆర్‌టీపీ నేతలతో షర్మిల చెప్పినట్లు సమాచారం.వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నిరాశకు గురిచేస్తోందని, షర్మిల ఏఐసీసీలో నియమితులైతే తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని సంతోషిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. షర్మిలకు తెలంగాణ కోసం పని చేయాలనే ఆసక్తి ఉన్నందున మా పార్టీ నాయకులు ఆమెను ఖమ్మం, నల్గొండ లేదా సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని పట్టుబట్టారు. తెలంగాణలో పార్టీకి ఖ్యాతి కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని వైఎస్ఆర్‌టీపీ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

* టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు ఫ్యామిలీ

మాజీమంత్రి దాడి ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో.. దాడి వీరభద్రరావు రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే.. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ఇదిలాఉంటే.. దాడి వీరభద్రరావు 2014ముందు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా.. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అనకాపల్లి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు దాడి వీరభద్రరావు. అయితే 2014 ముందు ఆయన వైసీపీలో చేరారు. గతంలో.. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ పోటీ చేశారు. కాగా.. 2019లో టిక్కెట్ లభించకపోవడంతో వైసీపీకి దూరంగా ఉంది దాడి ఫ్యామిలీ.

ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్‌కు స్పీడ్ బ్రేకర్ లాంటిదే!

తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మభ్య పెట్టిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్‌కు స్పీడ్ బ్రేకర్ లాంటిదే అని చెప్పారు. .వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో మళ్లీ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని.. అనవసరంగా కేసీఆర్‌ను ఓడించామని బాధపడతారని జోస్యం చెప్పారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం అన్నారు. తాను జిల్లాలో తిరుగుతుంటే కొంత మంది రైతు బంధు అని అడుగుతున్నట్లు వెల్లడించారు. పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయన్నారు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు.

ఆర్కేకు ధన్యవాదాలు తెలిపిన షర్మిల

వైతెపా అధ్యక్షురాలు షర్మిల పార్టీ ముఖ్య నేతలతో లోటస్‌పాండ్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై నేతలతో చర్చించినట్లు సమాచారం.  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరికపై విలేకరుల ప్రశ్నకు సూటిగా ఆమె స్పందించలేదు. అన్ని అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని వెల్లడించారు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశ్నించగా.. ఆర్కేకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు.మరోవైపు భేటీ అనంతరం వైతెపా ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. షర్మిల త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని తెలిపారు. ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

*  సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్

కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం అని, కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరం అవినీతిపై 48 గంటల్లో కేంద్రం సీబీఐతో విచారణ జరిగేలా రికమండ్ చేస్తామని వెల్లడించారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేయవద్దనే చట్టాన్ని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అయినా ఆ చట్టాన్ని తీసివేసి దర్యాప్తు చేస్తుందా? లేక బీఆర్ఎస్‌ను కాపాడుతుందా? అని నిలదీశారు. కాంగ్రెస్ సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై మంత్రులు వెళ్లారని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారని, కానీ వారికి ఏం చేయాలో కనీస అవగాహన లేకుండా పోయినట్లు తెలుస్తోందని విమర్శించారు. అసలు కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు.లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుందని కిషన్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌‌లో తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలు వస్తున్నారని చెప్పారు. నలుగురు సిట్టింగులకు ఎంపీ సీట్లు కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఎలాంటి చర్చ అసలు జరగలేదని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగకు టికెట్ అంటూ బేస్ లెస్ న్యూస్ వస్తోందని, ఆ ప్రచారం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ ఫోకస్ మొత్తం లోక్ సభ ఎన్నికలపైనే ఉందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. 50 శాతం లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండబోదని స్పష్టంచేశారు.కేసీఆర్ కు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారో లేదో తెలియదన్నారు. ఫామ్ హౌజ్‌లో కేసీఆర్.. ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. మీరు మాజోలికి రావద్దు.. మేము మీ జోలికి రాబోమని ఒప్పందం కుదిరింది.. అని విమర్శించారు.

3వేల కోట్లతో వికారాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేస్తాం

వచ్చే ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్‌(vikarabad) జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌(Speaker Prasad Kumar )అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్‌ భవనములో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు రోజులలో వికారాబాద్‌ నియోజకవర్గ ప్రజలందరికి అన్నలా ఉండి జిల్లాను అభివృద్ధి పరుస్తానని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ముందుగా రేషన్‌ కార్డులు అందజేస్తామని తెలియజేశారు. రేషన్‌ కార్డుల తర్వాత ఎన్నికలకు ముందు చెప్పినట్లు 6 గ్యారంటీలను అమలుపరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమేష్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ శంషాద్‌ బేగం, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, వికారాబాద్‌ నియోజకవర్గ ఎంపీపీలు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z