Business

కొత్త ఏడాది వేడుకల్లో నిమిషానికి రికార్డుస్థాయిలో ఆర్డర్లు

కొత్త ఏడాది వేడుకల్లో నిమిషానికి రికార్డుస్థాయిలో ఆర్డర్లు

కొత్త ఏడాది ప్రారంభంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్‌ డెలివరీ అండ్‌ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు రికార్డుస్థాయిలో ఆర్డర్లను బట్వాడా చేశాయి. ఓయో రూమ్‌ బుకింగ్స్‌ కూడా భారీ సంఖ్యలో జరిగాయి. ఎక్కువ మంది రాముడి జన్మ స్థలమైన ఆయోధ్యలో గదులు బుక్‌ చేసుకోవడం విశేషం. జొమాటోలో 2015-2020 మధ్య ఎన్ని ఆర్డర్లు అయితే బుక్‌ అయ్యాయో, అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబరు 31నే జరిగాయి. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్టనర్లు ఈ ఆర్డర్లను బట్వాడా చేశారని కంపెనీ తెలిపింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ సీఈఓ రోహిత్‌ కపూర్‌ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్‌ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. అదేవిధంగా డిసెంబరు 31న రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలు ఆర్డర్‌ చేసినట్లు పేర్కొంది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ఓయో రూమ్‌ బుకింగ్స్‌ కూడా రికార్డుస్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 37శాతం (6.2 లక్షల) రూమ్‌ బుకింగ్స్‌ జరిగాయి. కేవలం డిసెంబరు 30, 31 తేదీల్లోనే 2.3 లక్షల ఓయో రూమ్స్‌ బుక్‌ అయ్యాయి. అయోధ్యలో గతేడాదితో పోలిస్తే 70 శాతం అధికంగా, గోవాలో 50%, నైనీతాల్‌లో 60%ఎక్కువగా రూమ్స్‌ బుక్‌ అయినట్లు ఓయో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z