కరెంటు ఛార్జీలు పెంచాలా? వద్దా? అనే విషయంలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే.. సుమారు రూ.26 వేల కోట్లు బడ్జెట్‌లో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు కేటాయించాల్సి ఉంటుందని తేలింది.
ఈ అంశంపై ఈ నెల 31లోగా వార్షిక ఆదాయ అవసరాలు (యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్-ఏఆర్‌ఆర్) నివేదిక సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) డిస్కంలకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఏడాదిలో డిస్కంలకు వివిధ రాయితీలు, అప్పుల కిస్తీల చెల్లింపులకు రూ.11 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అవి సరిపోనందున ఆదాయ, వ్యయాల మధ్య లోటు నెలకు రూ.1386 కోట్లకు పెరిగిందని డిస్కంలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలు, లోటు కలిపి రూ.26 వేల కోట్లు అవసరమని లెక్కకట్టాయి.
ఎన్నికల నేపథ్యంలో ఆలస్యం..
ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కరెంటు ఛార్జీల సవరణ చేయాలంటే అంతకుముందు నవంబరు 30లోగా డిస్కంలు ఈఆర్‌సీకి ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు సమర్పించాలి. గత నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఇవ్వకుండా నిలిపివేసింది. డిస్కంలు సైతం ఏఆర్‌ఆర్ నివేదిక ఇచ్చేందుకు.. ఈ ఏడాది జనవరి 2 వరకూ గడువు తీసుకున్నాయి. ఈ గడువు ముగిసినా నివేదిక ఇవ్వలేదు. దీంతో ఈ నెల 31లోగా ఏఆర్‌ఆర్ సమర్పించాలని లేకపోతే ఫిబ్రవరి ఒకటి నుంచి జరిమానా విధిస్తామని డిస్కంలను తాజా ఉత్తర్వుల్లో ఈఆర్‌సీ హెచ్చరించింది. ఈ నివేదిక ఇచ్చిన 120 రోజుల్లోగా వాటిపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ జరిపి ఛార్జీల సవరణకు మార్చి 31లోగా తీర్పు చెబుతుంది. దీని ఆధారంగానే ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలను పెంచే అధికారం డిస్కంలకు వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగి ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలు సమర్పించాలని తాజాగా డిస్కంలు నిర్ణయించాయి. విద్యుత్ సంస్థలు ఇప్పటికే రూ.18 వేల కోట్ల అప్పుల్లో, మరో రూ.50 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నందున ఏఆర్‌ఆర్‌పై కొత్త ప్రభుత్వం ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెన్ యాక్సెస్ కరెంటుపై సర్‌ఛార్జి వసూలుకు ప్రతిపాదన
డిస్కంల నుంచి కాకుండా బయట (ఓపెన్ యాక్సెస్- ఓఏ) విద్యుత్ కొని వాడుకునే వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.1.95 చొప్పున సర్‌ఛార్జి వసూలుకు అనుమతించాలని కోరుతూ డిస్కంలు తాజాగా ప్రతిపాదనలు అందజేశాయి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకూ ఈ సర్‌ఛార్జి వసూలు చేస్తామని తెలిపాయి. ఈ ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలుంటే ఈ నెల 24లోగా డిస్కంలకు లేదా ఈఆర్‌సీకి పంపాలి. వచ్చే నెల 9న వీటిపై ఈఆర్‌సీ ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి తుది తీర్పు ఇస్తుంది.
👉 – Please join our whatsapp channel here –