తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పదిరోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం కావడం.. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడంతో నూతన సంవత్సరం వేళ సాధారణ భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. సోమవారం రాత్రంతా అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద క్యూలైన్లలో వేచిఉండి.. మంగళవారం తెల్లవారుజామున సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు పొందారు. శ్రీనివాసం లోపల క్యూలైన్లు నిండి బయట బస్టాండు వరకు కొనసాగింది. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమైన టోకెన్ల జారీ ఉదయం 8.45కి ముగిసింది. మొత్తం 17,500 టోకెన్లు జారీచేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బస్సుల్లో వచ్చిన పలు కుటుంబాలు.. భూదేవి కాంప్లెక్స్ వద్దనే ఆరుబయట చలిలో వేచిఉండి టికెట్లు పొందారు. గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్ల జారీని నిలిపివేశారు. అక్కడ నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టనుండటంతో మిగిలిన మూడు కేంద్రాల్లో మాత్రమే సర్వదర్శన టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నారు.
సర్వదర్శనానికి 12 గంటలు..
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా మంగళవారం సాయంత్రానికి క్యూలైన్లలలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 26 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. వీరికి దాదాపు 12 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. సోమవారం శ్రీవారిని 63,358 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.97 కోట్ల విలువగల హుండీ కానుకలు లభించాయి.
👉 – Please join our whatsapp channel here –