Health

ఇక పై రక్తం అవసరం లేకుండా షుగర్ టెస్ట్

ఇక పై రక్తం అవసరం లేకుండా షుగర్ టెస్ట్

ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహ స్థాయిని గుర్తించే పరీక్షలు ఖర్చుతో కూడుకున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందే. చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేక పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్‌ను నిర్ధరించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. దీనితో రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించొచ్చు. ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇస్తూ ఇటీవల ధ్రువపత్రం జారీ చేసింది.

నాలుగేళ్ల పాటు శ్రమించి…
జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఐఐటీ కాన్పుర్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 18 ఏళ్లలోపు చిన్నారులు టైప్‌-1 మధుమేహం బారిన పడుతున్నారు. రోజూ నాలుగు సార్లు గ్లూకోజ్‌ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్‌ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లి పోయే అవకాశాలు ఎక్కువ. టైప్‌-2 మధుమేహం బాధితులదీ ఇదే పరిస్థితి. వారి కోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో శ్రీనివాసరావు ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. ‘ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రోకెమికల్‌, సెన్సర్లను వినియోగించి నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ పరికరాన్ని రూపొందించా. దీనిని రెండేళ్ల పాటు భారత ప్రభుత్వం(ఇండియన్‌ పేటెంట్‌ అధారిటీ) అన్ని విధాలుగా పరీక్షించి గత నెల 29న పేటెంట్‌ హక్కులు నిర్ధరిస్తూ ధ్రువపత్రం జారీ చేసింది’ అని శ్రీనివాసరావు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z