కొత్తగా మెరిసిపోవాలంటే కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా! ట్రెండ్‌కు తగినట్టు ఉండాలంటే మార్కెట్లో రెడీమేడ్‌గా ఉండే వాటిని కొనుగోలు చేయాల్సిందేనా! ఈ మాటలకు కాలం చెల్లిపోయేలా వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు నేటి మహిళలు. పర్యావరణ అనుకూలంగా ఫ్యాషన్‌లోనూ మార్పులు చేసుకుంటున్నారు. అప్‌సైక్లింగ్ పేరుతో పాత డ్రెస్సులను, చీరలను కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఈ యేడాది వచ్చిన ఈ మార్పు రాబోయే రోజులను మరింత పర్యావరణ హితంగా మార్చేయనున్నారు అనేది ఫ్యాషన్ డిజైనర్ల మాట.
పాత వాటిని కొత్తగా మెరిపించడంలో ఖర్చు కూడా తగ్గుతుంది. పర్యావరణంపై కార్బన్ ఉద్గారాల ప్రభావమూ తగ్గుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన దగ్గర ఉన్న డ్రెస్సులనే కొత్తగా మార్చేయవచ్చు. చిన్నపాటి సృజనతో డ్రెస్సింగ్‌లో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు.
డెనిమ్.. ప్యాచ్
పాతవి అనే పేరే గానీ చాలామంది ఇళ్లలో పక్కన పెట్టేసిన డెనిమ్ జాకెట్స్, ప్యాంట్స్, కుర్తాలు.. ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే రకరకాల మోడల్స్‌ని తయారు చేసుకోవచ్చు. ప్యాచ్‌వర్క్‌తో రీ డిజైనింగ్ చేసి ఓవర్‌కోట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు.
శారీ ఖఫ్తాన్
కుర్తాల మీదకు సిల్క్ ష్రగ్స్ లేదా లాంగ్ ఓవర్ కోట్స్ వాడటం ఇండోవెస్ట్రన్ స్టైల్. పాత సిల్క్ లేదా కాటన్ చీరలను కూడా లాంగ్ కోట్స్‌కి ఉపయోగించ వచ్చు. అలాగే, ఖఫ్తాన్ డిజైన్స్‌కి కూడా శారీస్‌ను వాడచ్చు.
పర్యావరణ అనుకూలం
ఆర్గానిక్ కాటన్స్, వీగన్ క్లాత్స్.. స్లో ఫ్యాషన్ కిందకు వస్తాయి. వీటితో చేసే డిజైన్స్‌లో ప్రత్యేకంగా మెరిసిపోవడమే కాదు పర్యావరణ ప్రేమికులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.
మన దగ్గర ఉన్న పాత బట్టలను ఎలా తీసేయాలా అనుకునేవారు కొందరు, అవసరమైన వారికి తక్కువ ధరకు అమ్ముదాం అనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాంటివాళ్లకోసం కొన్ని వెబ్స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్స్ అమ్మకందారుల దగ్గర నుంచి దుస్తులు సేకరించి కావల్సిన వారికి అందజేసే మాధ్యమంగా పనిచేస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –