భారతీయులు సహా తమ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ కొత్త వీసా నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఇప్పటి నుంచి విద్యార్థులు తమ విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడంపై నిషేధం విధించింది. అయితే పీజీ రీసెర్చి, ప్రభుత్వ స్కాలర్షిప్ అందుకునే విద్యార్థులకు మినహాయింపు ఉంటుందని బ్రిటన్ తెలిపింది. విదేశీయుల వలసలకు అడ్డుకట్ట వేయడానికే విద్యార్థుల వీసా నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించింది.
ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో ఉన్నత విద్యాభ్యాసానికి వస్తున్న విదేశీ విద్యార్థులు తమకు కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకోవడం ఎక్కువైంది. 2019 నుంచి ఇప్పటి వరకు 930 శాతం పెరిగినట్లు తెలుస్తున్నది. 2019 సెప్టెంబర్‌లో 14,839 వీసాలు జారీ చేస్తే, గతేడాది సెప్టెంబర్ నాటికి జారీ చేసిన వీసాల సంఖ్య 1.52 లక్షలకు పెరిగిందని బ్రిటన్ స్టాటిస్టిక్స్ కార్యాలయం తెలిపింది. దీంతో విదేశీయుల అక్రమ వలసలను నియంత్రించేందుకు సన్నద్ధమైంది.
విదేశాల నుంచి భారీ వలసలను నియంత్రిస్తామని బ్రిటన్ వాసులకు ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లేవరీ చెప్పారు. సుమారు మూడు లక్షల మంది విదేశీయుల వలసలను నిరోధించడానికి వ్యూహం సిద్ధం చేశామన్నారు. విదేశీయులు తమ దేశంలో పని చేయడానికి విద్యార్థి వీసాను బ్యాక్ డోర్ రూట్‌గా ఎంచుకుంటున్నారని గతేడాది మేలో నాటి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ ఆరోపించారు. ఈ అక్రమ వలసల నిరోధానికి వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని అప్పట్లో చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –