పలు చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) హీరోగా మారిన సంగతి తెలిసిందే. అతడి తాజా చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు, అగ్ర హీరో మహేశ్ బాబు (Mahesh Babu)- డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అదే రోజున రాబోతోంది. ఈ క్రమంలో.. ఒకప్పుడు మహేశ్ బాబుకు తనయుడిగా నటించిన తేజ ఇప్పుడు ఆయనకు పోటీ ఇవ్వనున్నాడంటూ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీనిపై తేజ స్పందించాడు. ‘సూపర్‌స్టార్‌తో పోటీ ఏంటి? ఆయనతో పోటీ కాదు.. ఆయనతోపాటు..’ అని సమాధానమిచ్చాడు. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు.. ‘ఆల్ ది బెస్ట్’, ‘మేం రెండు సినిమాలు చూస్తాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాగా చెప్పావంటూ ప్రశాంత్ వర్మ సైతం కామెంట్ పెట్టారు.
దర్శకుడు వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘యువరాజు’లో మహేశ్- తేజ.. తండ్రి, కొడుకులుగా నటించారు. అంతకుముందు ‘రాజకుమారుడు’లోనూ సందడి చేశారు. ‘చూడాలని ఉంది’, ‘కలిసుందాం రా’, ‘ప్రేమ సందడి’, ‘ఇంద్ర’, ‘బాలు’ తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తేజ ‘ఓ! బేబీ’లో కీలక పాత్ర పోషించాడు. ‘జాంబీ రెడ్డి’తో హీరోగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ యాక్షన్ డ్రామాలో రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కల్పిత కథతో రూపొందిన సూపర్‌హీరో ఫిల్మ్ ‘హను-మాన్’లో అమృత అయ్యర్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఓ వానరం పాత్రకు ప్రముఖ నటుడు రవితేజ వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ రెండు సినిమాలు ఓకే రోజున రాబోతుండడంపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. ‘హను-మాన్’ వాయిదా పడే అవకాశాలున్నాయంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. అయితే, జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తామే ముందు ప్రకటించామని, ఇప్పటికే పంపిణీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యామని, తమ సినిమాని పోస్ట్‌పోన్ చేయలేని పరిస్థితి నెలకొందని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమకు ఎలాంటి ఇగో లేదన్నారు. వెంకటేశ్ ‘సైంధవ్’ (జనవరి 13), రవితేజ ‘ఈగల్’ (జనవరి 13), నాగార్జున ‘నా సామి రంగ’ (జనవరి 14) సంక్రాంతికి వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –