Fashion

ఈ సీజన్‌లో మేకప్ వేసుకుంటున్నారా?

ఈ సీజన్‌లో మేకప్ వేసుకుంటున్నారా?

చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. ఈ సమస్యను పోగొట్టుకునేందుకు చాలామంది మాయిశ్చరైజింగ్ క్రీములు, మేకప్ ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే బయట దొరికే ఉత్పత్తుల్లో చాలా వరకు ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే చలికాలం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఇంట్లోనే దొరికే వస్తువులతో వింటర్‌ స్కిన్‌ కేర్‌ను ఫాలో అవ్వొచ్చు. అదెలా అంటే..

* తేనె, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి మేలైన ప్యాక్. చర్మం చక్కగా శుభ్రపడుతుంది. మృదువుగా అవుతుంది.సహజసిద్ధమైన వెన్న, నూనె, గ్లిజరిన్‌లను చలికాలంలో మాయిశ్చరైజర్లుగా ఉపయోగించడం మంచిది.

* శనగపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు సమపాళ్లలో తీసుకుని, ఛాయపసుపు కొమ్ములు గుప్పెడు, గంధ కచూరాలు గుప్పెడు, ఎండబెట్టిన గులాబీ రెక్కలు కొన్ని కలిపి గ్రైండ్‌ చేసి పొడి చెయ్యాలి. ఈ పొడిని కొద్దికొద్దిగా తీసుకుని పెరుగులో కాని, మజ్జిగలోకాని, పాలలో గాని కలిపి, సబ్బుకి మారుగా ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి స్నానం చేస్తే ఒళ్లు పేలిపోకుండా ఉండడమే కాకుండా చర్మం నునుపు తేలి సువాసన వెదజల్లుతుంది.

* గుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

* కలబంద (అలొవెరా) రసం శరీరానికి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మృదుత్వం కోల్పోదు.

* ఒక చెంచా తేనెను పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మం కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. చర్మం ఆరోగ్యకరమైన నిగారింపును సంతరించుకుంటుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z