రైలు టికెట్ బుకింగ్‌కో యాప్. ఫిర్యాదులకు మరో యాప్. జనరల్ టికెట్లు తీసుకోవడానికి ఇంకో యాప్. ఇవి కాకుండా ట్రైన్ రన్నింగ్ స్టేటస్, పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవడానికీ రైల్వేతో పాటు ఇతర యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలన్నింటిని ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే (Indian Railways) సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ రూ.90 కోట్లు వెచ్చించనున్నట్లు ‘ఎకమిక్ టైమ్స్’ పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల యూజర్లు పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే ఇబ్బంది ఉండదని, రైల్వేకు సంబంధించిన సర్వీసులన్నీ ఒకేచోట లభిస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా యాప్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.
ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్‌కు రైల్ కనెక్ట్ యాప్ ఒక్కటే ఉంది. దీనికి మిలియన్లకొద్దీ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూటీఎస్, రైల్ మదద్ యాప్స్ సైతం వేలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తే.. ఇకపై ఆయా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఐఆర్‌సీటీసీ అందించే విమాన టికెట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ వంటి సేవలూ ఇందులోనే లభించనున్నాయి. దీనిని ఎప్పుడు తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.
👉 – Please join our whatsapp channel here –