DailyDose

పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే!

పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి లింకులో ఉన్న మూడు బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా సమస్యలున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పేర్కొనడం, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. తుది బిల్లు చెల్లించడానికి సంబంధిత ఇంజినీర్లు సిఫార్సు చేయడంతోపాటు, దీనికి సబంధించి గుత్తేదారుకు ధ్రువీకరణ కూడా ఇస్తారు. మేడిగడ్డ బ్యారేజీ పని చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థకు తుది బిల్లు సుమారు రూ.400 కోట్లవరకు చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నారం బ్యారేజీ పని చేసిన అప్కాన్స్‌ సంస్థకు రూ.161 కోట్ల తుది బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీ పని చేసిన నవయుగకు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అన్నారం పంపు హౌస్‌ 2022లో వరదలకు నీట మునిగిన తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు కాంక్రీటు వాల్‌ నిర్మాణ పని చేపట్టారు. సుమారు 90 శాతానికిపైగా పూర్తయిన ఈ పనికి మేఘా ఇంజినీరింగ్‌కు చెల్లించాల్సిన రూ.74 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మూడు బ్యారేజీలకు సంబంధించిన ఫైనల్‌ బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

సంక్రాంతిలోగా ఇచ్చేందుకు కసరత్తు
పెద్ద మొత్తాల బిల్లులు పెండింగ్‌లో పెట్టి చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల్ని మొదట చెల్లించాలని ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిసింది. నీటిపారుదల, రోడ్లు-భవనాలతో సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టి, ప్రాధాన్యాలు నిర్ణయించాకే చెల్లింపులపై ముందుకెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. పంచాయతీరాజ్‌తో సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లో చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నవారు ఎక్కువ మంది ఉన్నారని, మొదట వీరికి ప్రాధాన్యం ఇచ్చి చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. రూ.600 కోట్లు చెల్లిస్తే ఇలాంటి 7,500 మందికి ఊరట లభిస్తుందని ఆర్థిక శాఖ నివేదించినట్లు సమాచారం. సంక్రాంతిలోగానే ఈ మొత్తం చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నీటిపారుదల శాఖలో గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణ.. ఇలా అన్నింటికి కలిపి రూ.పదివేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోడ్లు-భవనాలతో సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటిపారుదల శాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఏయే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలో నిర్ణయించిన తర్వాత బిల్లుల చెల్లింపుపై ముందుకెళ్లనున్నట్లు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z