మార్కెట్లో నకిలీ ఔషధాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటిని అక్రమార్కులు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. నిన్నటికి నిన్న లైసెన్స్ లేకుండా తయారుచేసినవి జిల్లాకు చేరడం చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.6 లక్షల విలువైన మందులను ఔషధ నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా ఎన్నేళ్లుగా సాగుతోంది, ఏయే ఆసుపత్రులకు విక్రయించారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఇటీవల మార్కెట్లో బ్రాండెడ్ వాటిని నకిలీగా తయారు చేసి గుర్తించే వీలు లేకుండా ముద్రించి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. రోగం నయం కాకపోగా కొత్తది తలెత్తి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
రూ.20 ఉంటే.. రూ.90కి విక్రయం
తక్కువ ధరకు దొరికే కొన్ని మందులు ఎంఆర్పీ ఎక్కువగా ముద్రించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒక్క స్ట్రిప్ (10 మాత్రలు ఉండే షీట్) రూ.10కి లభిస్తే రూ.110 నుంచి రూ.150 ఎంఆర్పీ ముద్రించి అమ్ముతున్నారు. నరాలకు సంబంధించినవి, కడుపులో అల్సర్లకు చెందినవి అనేకం ఉన్నాయి. 500 డబ్బాలకు పైగా ఉంటే ఏ పేరు మీద కావాలంటే ఆ పేరుపై ముద్రించి ఇస్తున్నారు. ఎమ్మార్పీ ఎంతుండాలో సైతం కొందరు ఏజెన్సీ నిర్వాహకులే చెబుతున్నారు. దగ్గు మందు సీసా, బలానికి వాడే సిరప్లు రూ.20కి దొరికితే మార్కెట్లో రూ.90 – 110 వరకు విక్రయిస్తున్నారు.
ముగ్గురు వ్యక్తులే..
జిల్లాలో పీసీడీ ఔషధాలతోనే కొన్ని ఆసుపత్రులు నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. కొందరు వైద్యులు ఒకేసారి ఏక మొత్తంలో వీటిని కొంటున్నట్లు సమాచారం. మరికొందరు సొంతంగా కంపెనీ పెట్టి మందులు తయారు చేయించి ఆయా దుకాణాల్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో ముగ్గురు వ్యక్తులు పీసీడీ కంపెనీ పేరుతో విచ్చల విడిగా విక్రయాలు సాగిస్తున్నారు.
ఇష్టారీతిన బిల్లులు
రోగి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి అయ్యే ఖర్చుల కంటే ఔషధ దుకాణాల్లోనే బిల్లు ఎక్కువవుతోంది. ఇటీవల ఒక రోగి ఆసుపత్రి బిల్లు రూ.50 వేలు కాగా, ముందుల బిల్లు రూ.1.10 లక్షలకు చేరింది. ఐసీయూలో ఉండే రోగులకు మేజర్ ఇన్ఫెక్షన్లకు వాడే ఓ సూది మందు బ్రాండ్ కంపెనీది రూ.500 లభిస్తుంది. ఇదే మందు పీసీడీలో రూ.2500 నుంచి రూ.3000 వరకు ఎమ్మార్పీ ముద్రించి అమ్ముతున్నారు. ఐసీయూలో రోగి తీవ్రతను బట్టి రోజుకు రెండు, మూడు ఇంజెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇలా నిత్యం రూ.9 వేల వరకు వసూలు చేస్తున్నారు. పది రోజులుంటే సూది మందుకే రూ.లక్ష వరకు అయ్యే అవకాశం ఉంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు
నర్సయ్య, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ
ఇలాంటివి మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం. పీసీడీలో సైతం ఎమ్మార్పీ ఎక్కువ వేయడానికి ఉండదు. డ్రగ్ కంట్రోల్ ప్రైజ్ కంటే రూపాయి ఎక్కువైనా కేసు నమోదు చేస్తాం. ఇటీవల జిల్లాలో నకిలీ మందుల గుట్టు రట్టుచేశాం. తనిఖీలు ముమ్మరం చేస్తాం.