అయోధ్యలో రామ మందిర (Ram Mandir) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గర్భగుడిలో 51 అంగుళాల ‘బాల రాముడి’ (Ram Lalla) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య ఆలయ విశేషాలను శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Teerth Kshetra) పంచుకుంది.
అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం నగర సంప్రదాయ శైలిలో నిర్మిస్తున్నారు. ఉత్తరభారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిల్లో ఇదీ ఒకటి. పశ్చిమ, తూర్పు భారత్‌లోనూ ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
380 అడుగులు (తూర్పు నుంచి పడమర) పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం కొనసాగుతోంది.
మూడు అంతస్తుల్లో ఆలయం నిర్మించగా.. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. మొత్తంగా ఆలయానికి 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌తోపాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాల రాముడి (Ram Lalla) విగ్రహం ఉంటుంది.
ఆలయంలో ఐదు మండపాలు ఉంటాయి. నృత్యం, రంగమండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనా మండపాలుంటాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవుళ్లు, దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
తూర్పున సింహ ద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్లాలి. ఇక్కడ నుంచి 32 మెట్లు ఉన్నాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం లిఫ్టులు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో 732 మీటర్ల పొడవుతో గోడ ఉంటుంది. దాని వెడల్పు 14 అడుగులు.
వాస్తవానికి నగర శైలి సంప్రదాయంలో ఆలయానికి ప్రహరీ ఉండదు. ద్రవిడ ఆలయకళలో ఇది కనిపిస్తుంది. కానీ ఉత్తర, దక్షిణ ఆలయ నిర్మాణశైలికి ప్రతీకగా ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం.
ఆలయం నాలుగు మూలల నాలుగు ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య భగవానుడు, భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం.. దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది.
పురాణకాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది. వాల్మీకి , వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల, నిశద్‌రాజ్, శబరి, దేవిఅహల్య ఆలయాలను అక్కడ (Temple Complex) నిర్మిస్తున్నారు.
నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్ తిలపై ఉన్న పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే జటాయువు విగ్రహం ఏర్పాటు చేస్తారు.
ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇనుము ఉపయోగించడం లేదు. ఆలయం కింద 14 మీటర్ల మందంతో రోలర్ కాంపాక్టు కాంక్రీట్ (ఆర్‌సీసీ) వేశారు. భూమిలోని తేమ నుంచి ఆలయానికి రక్షణగా గ్రానైట్‌తో 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు.
మురుగునీరు, నీటిశుద్ధి, అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఆలయ కాంప్లెక్సులోనే నిర్మిస్తున్నారు.
భక్తుల సౌకర్యం కోసం 25వేల మంది సామర్థ్యం కలిగిన ఓ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని పెట్టుకునేందుకు లాకర్లు, వైద్య సదుపాయాలు ఇక్కడ ఉండనున్నాయి. అక్కడే బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, కుళాయిలు ఉంటాయి.
ఆలయంలో పర్యావరణం-నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 70శాతం ఎప్పటికీ పచ్చగానే కనిపించే విధంగా చూస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –