Health

బ్లడ్ బ్యాంకులు ఆస్పత్రులకు ముఖ్యమైన సూచనలు

బ్లడ్ బ్యాంకులు ఆస్పత్రులకు ముఖ్యమైన సూచనలు

అత్యవసర సమయాల్లో రోగులకు కావాల్సిన ‘రక్తం’ విషయంలో బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తానికి వసూలు చేస్తున్న అన్ని రకాల ఫీజులను తీసేయాలని నిర్ణయించినట్లు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) వెల్లడించింది. ‘రక్తం అమ్మకానికి కాదు’ అని ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంకులు కేవలం ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని సూచించింది.

‘‘రక్తానికి అధిక రుసుం అంశంపై గతేడాది సెప్టెంబరులో నిర్వహించిన డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ 62వ సమావేశంలో అధికారులు పూర్తిస్థాయిలో చర్చలు జరిపారు. ‘రక్తం అమ్మకానికి కాదు’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. దాన్ని సరఫరా మాత్రమే చేయాలని నిర్ణయించారు. బ్లడ్‌ బ్యాంకులు కేవలం ప్రాసెసింగ్‌ రుసుం వసూలు చేయాలని సిఫార్సు చేశారు’ అని డిసెంబర్‌ 26నాటి లేఖలో డీసీజీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణ విభాగాలకు తెలియజేసినట్లు తెలిపింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం రక్తం లేదా రక్తం విభాగాలకు (ప్లాస్మా, తెల్లరక్తకణాలు వంటివి) రూ.250 నుంచి రూ.1550 వరకు మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు డీసీజీఐ సూచించింది. కొన్ని ఆసుపత్రులు, బ్లడ్‌ బ్యాంకులు అధిక రుసుం వసూలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. రక్తదానం చేయని పక్షంలో ఒక్కో యూనిట్‌కు రూ.3000 నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. రక్తం కొరత, అరుదైన గ్రూపు అవసరమైన సమయంలో ఈ ధర మరింత ఎక్కువ ఉంటోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z