DailyDose

పోనీ అదైనా సరిగా ఇస్తున్నారా అంటే?

పోనీ అదైనా సరిగా ఇస్తున్నారా అంటే?

పండుగ వచ్చిందంటే…
సంబరాలు చేసుకుంటాం…
పిండివంటలు పంచుకుంటాం…
చేసిందేదైనా ఇచ్చిపుచ్చుకుంటాం!
పండుగపూట పస్తుంటే పగవాడినైనా కనికరిస్తాం!
…సామాన్యులే ఇలా ఉంటే…
సర్కారెలా ఉండాలి?
ఎంత ఉదారంగా ప్రవర్తించాలి?
అందరినీ కాకున్నా పేదలనైనా ఆదుకోవాలి…
పండుగ పూట పస్తులుండకుండా చూడాలి!

కానీ…
ముఖ్యమంత్రిగా జగన్‌ పీఠమెక్కిన తర్వాత…
ఆ ఆనవాయితీని అటకెక్కించేశారు..
సంక్రాంతి, క్రిస్మస్‌ ‘పండుగ కానుక’లను ఎత్తేశారు…
‘రంజాన్‌ తోఫా’ను నిర్దయగా ఆపేశారు…
రేషన్‌ దుకాణాల్లో నిత్యావసరాలకు కత్తెర వేశారు.
ధరలకు రెక్కలు తొడిగారు…
కష్టజీవికి పండుగ సంబరం లేకుండా చేశారు!

తెదేపా ప్రభుత్వ హయాంలో పండుగలు వచ్చాయంటే చాలు… పేదింటికి సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు చేరిపోయేవి. రంజాన్‌ తోఫాలతో సందడి నెలకొనేది. ముఖ్యమంత్రిగా జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టగానే పండుగ కానుకలకు కత్తెరేశారు. రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే కందిపప్పును రెండు కిలోల నుంచి కిలోకు కుదించారు. దాని ధరనూ అమాంతం పెంచేశారు. పోనీ అదైనా సరిగా ఇస్తున్నారా అంటే… అదీ లేదు. చిరుధాన్యాలు, గోధుమపిండి ఇతర నిత్యావసరాల పంపిణీకి నాలుగేళ్లపాటు స్వస్తి పలికారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో ఇస్తున్నాం… అన్నట్లు కొన్ని ప్రాంతాల్లో మొక్కుబడిగా పంపిణీ చేయిస్తున్నారు.

నీరు గార్చి.. కన్నీరు మిగిల్చి!
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ పీఠమెక్కిందే తడవుగా.. నిత్యావసరాల పంపిణీకి కోతలు పెట్టడం మొదలైంది. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎవరైనా.. గత ప్రభుత్వం కంటే మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తపిస్తారు. కానీ జగన్‌ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, తెదేపా మీది ఆగ్రహాన్ని పేదల మీద చూపిస్తున్నారు. సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు, రంజాన్‌ తోఫాలను ఏకపక్షంగా ఎత్తేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కానుకల కోసం మొత్తంగా రూ.1,800 కోట్ల వరకు ఖర్చు చేశారు. తనను తాను పేదల పక్షపాతిగా చెప్పుకొనే జగన్‌ బీదల కోసం రూపాయి కూడా ఇవ్వడం లేదు. పేద కుటుంబాల్లో పండుగ సంతోషం నింపేందుకు ఏడాదికి రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. ఇతర నిత్యావసరాల పంపిణీని క్రమంగా కుదించుకుంటూ వచ్చారు. పౌరసరఫరాల సంస్థ పేరుతో ఏటా వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చుకుంటున్న సర్కారు.. బీదల సంక్షేమానికి అందులోంచి కొంత మొత్తమైనా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఆఖరుకు మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థనే నీరుగార్చి.. పేదలకు కన్నీటినే మిగుల్చుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ దుకాణాల ద్వారా పండుగ కానుకలు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లోనూ.. పండగ సందడి నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం కలిగింది. రాష్ట్రంలోని రేషన్‌ డీలర్లకు కూడా కమీషన్‌ కింద ఒక్కో కానుకకు రూ.10 చొప్పున చెల్లించారు. గతంలో సంక్రాంతి కానుక కింద అరకిలో కందిపప్పు, అరలీటరు పామోలిన్‌, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, 100మి.లీ నెయ్యి చొప్పున ఆరు రకాల సరకుల్ని పంపిణీ చేశారు. క్రిస్మస్‌ సమయంలో ఇవే కానుకల్ని క్రైస్తవులకు అందజేసేవారు.దీనికి ఏడాదికి సగటున రూ.325 కోట్ల వరకు ఖర్చు చేశారు. రంజాన్‌ తోఫా ద్వారా సుమారు 11.30 లక్షల ముస్లిం కుటుంబాలకు లబ్ధి కలిగింది. వారికి 2 కిలోల పంచదార, 5 కిలోల గోధుమపిండి, కిలో సేమియా, 100 మి.లీ నెయ్యి చొప్పున ఉచితంగా అందించారు. దీనికి రూ.136.71 కోట్లు ఖర్చు చేశారు.

మొహం చాటేసి.. సున్నా చుట్టేసి..

జగన్‌ అధికారంలోకి రావడంతోనే.. కానుకల్ని కరిగించేశారు. పౌరసరఫరాల సంస్థ సేవల కోసం అంటూ సుమారు రూ.30వేల కోట్లకు పైగా అప్పు తెచ్చినా.. పేదల గోడు పట్టించుకోకుండా వదిలేశారు. ఎన్నికల ముందు మాత్రం ఆహా.. ఓహో.. అనేలా హామీల సునామీ సృష్టించారు. గెలిచాక మాత్రం.. పండుగ కానుకలెందుకు శుద్ధ దండగ అన్నట్లు వ్యవహరిస్తూ… అన్నింటికీ సున్నా చుట్టేశారు. 2019 జూన్‌ తర్వాత నుంచైతే కానుకల పంపిణీని పూర్తిగా ఆపేశారు. గతంలో ఒక్కో కార్డుపై కిలో రూ.40 చొప్పున 2 కిలోల కందిపప్పును ఇచ్చేవారు. ఇప్పుడు పండుగ సమయంలోనూ కనీసం కిలో కందిపప్పూ ఇవ్వడం లేదు. దాని ధర కూడా కిలో రూ.67కు పెంచేశారు. ప్రతి నెలా 14 వేల టన్నుల చొప్పున అవసరం కాగా.. 6 వేల టన్నులకు మించి అందుబాటులో ఉంచడం లేదు. గతేడాది జులై నుంచి వాటిని కూడా పూర్తిగా నిలిపేశారు. ఈ జనవరిలో ఇస్తామంటున్నా.. 50% కార్డుదారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. అదీ కొన్ని జిల్లాల్లో సరిగా అందడం లేదు. మొత్తంగా నిత్యావసరాల పంపిణీనే అపహాస్యం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z