వచ్చే మూడేళ్లలో పెద్ద వ్యాపారులు (మర్చంట్స్), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సీఈఓ దిలీప్ ఆస్బే గురువారం వెల్లడించారు. ప్రస్తుతం అందరూ నగదుకు ప్రత్యామ్నాయంగా యూపీఐ చెల్లింపులపై దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు. యూపీఐ వ్యవస్థలోకి మరో 50 కోట్ల మందిని తీసుకురావాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయని.. అందుకే దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా యూపీఐ చెల్లింపులపై సహేతుక ఛార్జీలు వసూలు చేయాలన్నది ప్రతిపాదనగా తెలిపారు. అయితే చిన్న వ్యాపారుల జోలికి వెళ్లకుండా, పెద్ద వ్యాపారుల నుంచే ఈ ఛార్జీలు వసూలు చేస్తామన్నారు. దీనికి ఏడాది నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. బాంబే ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (బీసీఏఎస్) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ ఈ వివరాలు వెల్లడించారు. సైబర్ భద్రత, సమాచార భద్రత కోసం బ్యాంకులు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను 10 – 25% పెంచాలని అభిప్రాయపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –