Politics

ఇలాంటి వ్యవహారాలు చేసే మనిషిని కాదు!

ఇలాంటి వ్యవహారాలు చేసే మనిషిని కాదు!

‘చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌ను గట్టిగా తిట్టాలి. తరచూ, పరిస్థితుల ఆధారంగా మీడియా ముందుకొచ్చి వారి గురించి నీచంగా మాట్లాడాలి. ఈ పని చేస్తేనే వచ్చే ఎన్నికల్లో మీ టికెట్లు మీకుంటాయి’ ఇది ఇప్పుడు వైకాపా అధినాయకత్వం తన పార్టీలోని కొందరు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇస్తున్న టార్గెట్‌. కొన్ని రోజుల క్రితం రాజధాని అమరావతికి సమీపంలోని ఒక ఎంపీకి ఇదే లక్ష్యాన్ని నిర్దేశించింది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు ఆయన వద్దకు వెళ్లి అధిష్ఠానం సందేశాన్ని తెలిపారు. అందుకు ఎంపీ ససేమిరా అన్నారు. ‘ఇలాంటి వ్యవహారాలు చేసే మనిషిని కాదు. మాకు విలువలున్నాయి. టికెట్‌ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదని చెప్పాలి కానీ, ఇలా నీచమైన పనులకు పురమాయించాలని చూడడం మంచి పద్ధతి కాదు’ అని ఆయన తన నిర్ణయాన్ని చెప్పి వారిని తిప్పి పంపారు.

మాది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర..
ఎంపీకి చెప్పినట్లే.. తాజాగా అదే పార్లమెంట్‌ పరిధిలోని ఒక ఎమ్మెల్యేకు టార్గెట్‌ ఇచ్చారు. అయితే ఈ సందేశాన్ని ఆ ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లేందుకు వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త సాహసించలేకపోయారు. దీంతో ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో పాటు నెల్లూరుకు చెందిన ఒక నాయకుడిని ఆ ఎమ్మెల్యే వద్దకు పంపారు. అధిష్ఠానం ఇచ్చిన లక్ష్యాన్ని వారు వివరించగా.. ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మా నాన్న ఎమ్మెల్యేగా చేశారు. నేనూ నాలుగుసార్లు ఎమ్మెల్యేనయ్యా. మాది 40 ఏళ్ల రాజకీయ జీవితం. మీ ద్వారా నాకు ఈ సందేశం పంపిన నాయకుడికి 12 ఏళ్ల అనుభవమే ఉంది. విలువల్లేని రాజకీయాలు మేం చేయం. మా నియోజకవర్గంలో ఒక సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంతో ఆ సామాజికవర్గానికి చెందిన నేతలను నాతో తిట్టించి.. తర్వాత నాకు టికెట్‌ ఇస్తారా? మీరు ఇప్పుడు అతిథులుగా వచ్చారని గౌరవిస్తున్నా, ఇదే విషయాన్ని ఫోన్‌లో చెబితే నా స్పందన మరోలా ఉండేది’ అని సదరు ఎమ్మెల్యే ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

గతంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసినప్పుడు అవకాశం దక్కని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కలిసి మాట్లాడారు. ‘మీరు ప్రతిపక్ష నాయకులపై గట్టిగా మాట్లాడలేదు. అందువల్లే మీకు అవకాశం రాలేదు’ అనే సమాధానం వారికి వచ్చిందని అప్పట్లో వార్తలు బయటకొచ్చాయి. ప్రతిపక్ష నేతలను దూషించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు టార్గెట్‌ ఇవ్వడమేంటని వైకాపాలో చర్చనీయాంశంగా మారింది.