Business

ఆర్‌బీఐ కీలక ఆదేశాలు-వాణిజ్య వార్తలు

ఆర్‌బీఐ కీలక ఆదేశాలు-వాణిజ్య వార్తలు

* ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

బ్యాంక్‌ఖాతా ఉండి ఎలాంటి లావాదేవీలు జరపని వినియోగదారులపై విధించే ఛార్జీలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్లు గడుస్తున్నా బ్యాంక్‌ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపని వారి అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ లేదంటూ ఛార్జీలు వేస్తూంటారు. ఇకపై ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ లేదంటూ ఛార్జీలు వేయకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించింది. అలాగే స్కాలర్‌షిప్‌ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం ఓపెన్‌చేసిన బ్యాంక్‌ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా వాటిని ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.అన్‌క్లెయిమ్డ్‌ బ్యాంక్‌ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా, ఇన్‌ఆపరేటివ్‌ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్‌లో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేరుకుపోయిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు/ వారసులకు చేరడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడుతాయని సర్క్యులర్‌ ద్వారా తెలిసింది.

* లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

రెండురోజుల వరుస నష్టాల అనంతరం గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. కంపెనీలకు సంబంధించిన అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలున్నాయి. ఈ క్రమంలో మదుపరుల నుంచి మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి. ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 490 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 141 పాయింట్లకుపైగా పెరిగింది.ఉదయం సెన్సెక్స్‌ 71,678.93 పాయింట్ల వద్ద టేడ్రింగ్‌ మొదలైంది. ఇంట్రాడేలో 71,954 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 490.07 పాయింట్ల లాభంతో 71,847.57 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 141.26 పెరిగి.. 21,658.60 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో గురువారం ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లలో గరిష్ట కొనుగోళ్లు కనిపించాయి. 50 షేర్ల బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4శాతానికిపైగా ఎక్కువ లాభంతో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

* Jioలో ప్రత్యేక డేటా ప్యాక్‌

వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్‌ జియో రూ.148తో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి.జియో రూ.148 ప్లాన్‌ కేవలం డేటా ప్యాక్‌ మాత్రమే. వాయిస్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్‌ ప్లాన్ ఉండాల్సిందే. సోనీలివ్‌, జీ5, జియోసినిమా ప్రీమియం, డిస్కవరీ+, లయన్స్‌గేట్‌, సన్‌నెక్ట్స్‌ సహా మొత్తం 12 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఇవన్నీ జియో టీవీ ప్రీమియంలో భాగంగా వీక్షించొచ్చు. మరోవైపు జియో సినిమా ప్రీమియం కూపన్‌ మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

* విద్యుత్​ వాహనాల కొనుగోలుపై మహిళలకు అదిరే ఆఫర్

ప్రత్యామ్నాయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను ప్రజల ముందుకు తీసుకువస్తోంది. అందులో భాగంగానే విద్యుత్​ విహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్​ 2 కు కొనసాగింపుగా ఫేమ్​ 3 ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ఈ పథకానికి రూ. 26,400 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పేర్కొంది. అదే విధంగా ఇరుపక్షాల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిజినెస్​ స్టాండర్డ్​ సైతం తన కథనంలో తెలిపింది.ఫేమ్​ –2 సబ్సిడీ పథకం గడువు 2024 మార్చి 31 తో ముగియనుంది. ఫేమ్​ –3 లో టూ వీలర్​, త్రీ వీలర్​, ఫోర్​ వీలర్​ కొనుగోళ్లపై సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. గతంలో మాదిరి కాకుండా ఎలక్ట్రిక్​ టూవీలర్ కి ఇచ్చే సబ్సిడీ ని తగ్గించాలని ప్రతిపాదించారు. కిలోవాట్​ బ్యాటరీకి తొలి ఏడాది రూ.15వేలు, మరుసటి ఏడాది రూ. 7,500, ఆ తర్వాత వరుసగా రెండేళ్లు సబ్సిడీ మొత్తాన్ని రూ. 3వేలు ఇలా రూ. 1500 వరకు కుదించాలని ప్రయత్నిస్తుంది. ఒక్కో టూవీలర్​ కు అత్యధికంగా చెల్లించే సబ్సడీ ని సైతం రూ. 15వేలకు పరిమితం చేయాలని భావిస్తోంది. అదే విధంగా మహిళల పేరిట రిజిస్టర్​ చేసే ఏ వాహనానికైనా 10 శాతం అదనపు సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

* కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అంబానీ

భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ‘ముఖేష్ అంబానీ’ (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.జియో, బ్లాక్‌రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z