DailyDose

సైబర్‌ వలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి-నేర వార్తలు

సైబర్‌ వలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి-నేర వార్తలు

* సైబర్‌ వలలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

సైబర్‌ వలలో పడి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ పరిధిలోని గ్రీన్‌విలాస్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పార్ట్‌ టైం జాబ్‌ అంటూ డిసెంబర్‌ 18వ తేదీన వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్‌ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్‌ ఐడీ క్రియేట్‌ చేసి ఇచ్చారు.ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్‌ నేరగాళ్లు వ్యాలెట్‌లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్‌ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్‌పూర్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అదే విధంగా అమీన్‌పూర్‌ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్‌ 2వ తేదీన విద్యుత్‌ బిల్‌ కట్టలేదని ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్‌ లింక్‌ను క్లిక్‌ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్‌ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.అమీన్‌పూర్‌ మండల పరిధిలోని పటేల్‌గూడా సిద్ధార్థ నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్‌లోన్‌ ఇస్తామంటూ ఫోన్‌కాల్‌ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్‌ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.హత్నూర( సంగారెడ్డి): ఆల్‌లైన్‌ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్‌ నవీన్‌ మంగళవారం ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్‌కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్‌ అమ్మకందారుడి ఫోన్‌ పే నంబర్‌కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్‌లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్‌ చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

* తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన కొడుకు

యువత కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి యువత ఏదైనా చిన్న సమస్య ఉంటే తనువు చాలించాలనుకుంటున్నారు. వారు తీసుకునే అలాంటి నిర్ణయం వల్ల తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది. అయితే ఓ విద్యార్థి మనోవేదనతో ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన యువకుడు విష్ణు నైస్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.తన తండ్రి రేషన్ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఆయనకు ఫోన్ చేశాడు. ఇకపై తప్పు చేయను అని చెప్పి, తుపాకీతో ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భయాందోళనకు గురైన తండ్రి.. ఇంటికి వచ్చి చూసేసరికి అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.అయిన ఫలితం లేకపోయింది.విష్ణు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

* వైన్‌ షాప్‌లో దొంగతనం

గుర్తుతెలియని వ్యక్తులు వైన్‌ షాపులో చొరబడి నగదు, మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజాపేట మండలంలోని పొట్టిమర్రి గ్రామ పరిధిలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిమర్రి గ్రామ పరిధిలో మాధవరెడ్డి అనే వ్యక్తి అరుణాచల వైన్‌ షాపును నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటలకు రోజుమాదిరిగానే వైన్‌ షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయాడు.బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు వైన్‌ షాపులో దొంగలు పడినట్లు గుర్తించి మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న మాధవరెడ్డి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి క్లూస్‌ టీంను రప్పించి పరిసరాలను పరిశీలించారు.రూ.4,21,000 నగదుతో పాటు సుమారు మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు వైన్‌ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

* యశస్విపై సీఐడీ కేసు నమోదు

తనపై సీఐడీ ఇచ్చిన లుక్‌ ఔట్‌ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi) ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు. లుక్‌ఔట్‌ నోటీసు ఉద్దేశం నెరవేరిందని పేర్కొన్నారు. లుక్‌ఔట్‌ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, ఈ నోటీసును కొట్టివేయాలని కోర్టును కోరారు. దీనిపై ఉన్నతాధికారుల సూచనలు తీసుకోవాలని సీఐడీకి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యశస్విపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

* బంజారాహిల్స్‌లో దారుణం

బంజారాహిల్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ వాడుతున్నాడని కోపంతో వలస కూలీపై సెక్యూరిటీ గార్డులు కర్రలతో దాడి చేశారు. దీంతో వలస కూలీగా వచ్చిన యువకుడు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి

హైదరాబాద్‌ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. తన తండ్రి, అమ్మమ్మతో కలిసి సోదరుడిని స్కూల్‌ బస్సు ఎక్కించడానికి చిన్నారి జావ్లానా రోడ్డుపైకి వచ్చింది. డ్రైవర్‌తో తండ్రి మిథున్‌ మాట్లాడుతుండగా అమ్మమ్మతో ఉన్న చిన్నారి.. నాన్న వద్దకు వెళ్తానంటూ పరుగులు తీసింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌ వాహనం తీయగా, ప్రమాదవశాత్తు టైర్‌ కిందపడి మృతి చెందింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

* ఆపరేషన్​ వికటించి మృతి చెందిన ఓ మహిళ

కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన కాలాపత్తర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య మృతికి కారణమైన సకీనా ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త కాలాపత్తర్​ పోలీసులను ఆశ్రయించాడు. కాలాపత్తర్ ఇన్​స్పెక్టర్​ దాలినాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఫారూఖ్​నగర్​ కు చెందిన మహమ్మద్​ అబ్దుల్​ అలీ స్క్రాబ్​ వ్యాపారి. 13 ఏళ్ల క్రితం పాతబస్తీకి చెందిన రేష్మాబేగం (28)తో వివాహం జరిగింది.వీరికి నలుగురు సంతానం. దీంతో రేష్మాబేగం కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గత డిసెంబర్​ 16వ తేదీన నవాబ్​ సాహెబ్​ కుంటలోని సకీనా ఆసుపత్రిలో చేర్పించాడు. 17వ తేదీన ఆమెకు ఆపరేషన్​ చేసిన వైద్యులు 18వ తేదీన డిశ్చార్జి చేశారు. ఇంటి కి వెళ్లాక కూడా ఆమె తరచూ అనారోగ్యానికి గురౌంది. 24వ తేదీన రేష్మాబేగంను చికిత్స నిమిత్తం మరోసారి సకీనా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు సరైన విధంగా స్పందించకపోవడంతో షాద్​నగర్​లోని డయాగ్నస్టిక్​ సెంటర్​కు తీసుకువెళ్లి పరీక్ష చేయించడంతో అసలు విషయం బయటపడింది. కుటుంబ నియంత్రణకు,బదులుగా వేరే ఆపరేషన్​ చేయడంతోనే రేష్మా ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్నారు. వెంటనే రేష్మాబేగంను మెరుగైన చికిత్స నిమిత్తం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించి జనవరి 1వ తేదీన మృతి చెందింది. సకీనా ఆసుపత్రి వైద్యుల కారణంగానే తన భార్య రేష్మాబేగం మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త మహ్మద్​ అలీ కాలాపత్తర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసుపత్రికి చెందిన వైద్యులపై కేసు నమోదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z