Politics

రాహుల్ పాదయాత్ర పేరు స్వల్ప మార్పు

రాహుల్ రెండో యాత్రకు పేరు స్వల్ప మార్పు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మహాయాత్రకు కాంగ్రెస్‌ (Congress) సన్నద్ధమైన విషయం తెలిసిందే. భారత్‌ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర చేపట్టనుంది. దీనికి తొలుత ‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’ అని పేరు పెట్టగా.. తాజాగా స్వల్ప మార్పు చేశారు. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నేతృత్వం వహించే ఈ యాత్రకు ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ గురువారం వెల్లడించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలో గురువారం కీలక సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేశ్‌ వెల్లడించారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్‌ గాంధీ మాట్లాడతారని జైరాం రమేశ్‌ వెల్లడించారు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో సాగనుంది.

అయితే, తొలి దశలో జరిగిన భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. గతంలో రాహుల్‌ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z