Business

గూగుల్ మీట్ కాల్‌లో 200 మంది ఉద్యోగుల తొల‌గింపు-వాణిజ్య వార్తలు

గూగుల్ మీట్ కాల్‌లో 200 మంది ఉద్యోగుల తొల‌గింపు-వాణిజ్య వార్తలు

* గూగుల్ మీట్ కాల్‌లో 200 మంది ఉద్యోగుల తొల‌గింపు

కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత‌కు బ్రేక్ ప‌డ‌క‌పోవ‌డం టెకీల్లో గుబులు రేగుతోంది. అమెరికాకు చెందిన టెక్ స్టార్ట‌ప్ ఫ్రంట్‌డెస్క్ (Frontdesk) ఈ ఏడాది తొలి మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డింది. రెండు నిమిషాల వ‌ర్చువ‌ల్ కాల్ ద్వారా కంపెనీ ఏకంగా 200 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌లో ఫుల్‌టైం, పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉద్యోగుల‌పై వేటువేసింద‌ని టెక్‌క్రంచ్ వెల్ల‌డించింది.కాల్‌లో ఉద్యోగుల‌ను ఉద్దేశించి ఫ్రంట్‌డెస్క్ సీఈవో జెస్సీ డిపింటో మాట్లాడుతూ కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్ధిక క‌ష్టాల‌ను ఏక‌ర‌వుపెట్టార‌ని, దివాళా ప్ర‌త్యామ్నాయం కోసం కంపెనీ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేయ‌నుంద‌ని ఆయ‌న తెలిపార‌ని టెక్‌క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రాప‌ర్టీ స్టార్ట‌ప్ పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం జాబ్ మార్కెట్‌లో గుబులు రేపుతోంది.2017లో ఏర్పాటైన ఫ్రంట్‌డెస్క్ అమెరికా వ్యాప్తంగా 1000 ఫ‌ర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్‌ను నిర్వ‌హిస్తోంది. విస్కాన్సిన్‌కు చెందిన ప్ర‌త్య‌ర్ధి కంపెనీ జెన్‌సిటీని స్వాధీనం చేసుకున్న ఏడు నెల‌ల్లోనే ఫ్రంట్‌డెస్క్ ఉద్యోగుల‌పై వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది.

* ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచిన టయోటా

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ. 42,000 వరకు ధరలను పెంచినట్లు ప్రకటించింది. వేరియంట్లను బట్టి కనీస పెంపు ధర రూ.10,000 వరకు ఉంది. టయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్‌ టాప్-ఎండ్ ZX 7-సీటర్ ధర రూ. 25,000 వరకు పెరిగింది. ఇప్పుడు అది రూ.26.30 లక్షల వరకు అయింది. బేస్ వేరియంట్‌లో మత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, ఇదే మోడల్‌లో మిడ్, టాప్-స్పెక్ G, V ట్రిమ్‌ల, G CNG, V MT AWD వేరియంట్‌ల ధరల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు.అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మోడల్ ధర రూ. 28,000 వరకు పెరిగింది. ఇదే మోడల్‌లో బేస్-స్పెక్ E వేరియంట్ గరిష్టంగా రూ. 28,000 పెరగడంతో రూ. 10.86 లక్షలుగా ఉన్న ధర రూ. 11.14 లక్షలకు చేరుకుంది. ఇంకా S- CNG, G -CNG ధరలు రూ.15,000, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ వేరియంట్‌ల ధర రూ. 20,000 పెరిగాయి. ప్రస్తుతం టయోటా SUV రూ. 11.14 లక్షల నుండి రూ. 20.19 లక్షల మధ్య ఉంది. ఇన్నోవా హైక్రాస్ రెగ్యులర్ వేరియంట్‌ ధర రూ. 10,000, MPV -హైబ్రిడ్ వేరియంట్‌లు రూ. 42,000 వరకు పెరిగాయి.

* PhonePe: కొత్త సీఈవో

ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్‌ను తమ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ బిజినెస్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.ఫోన్‌పేలో చేరిన రితేష్‌ పాయ్‌.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. యస్ బ్యాంక్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్‌ చేరికపై ఫోన్‌పే చీఫ్‌, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్‌ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.ఫోన్‌పే 2015 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేసి వాలెట్‌గా రీబ్రాండ్ చేసింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఐదు కోట్ల బ్యాడ్జ్‌ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్‌గా ఫోన్‌పే నిలిచింది.

* Tesla:16 లక్షల కార్లను రీకాల్

అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల (EV) తయారీ సంస్థ టెస్లా (Tesla).. చైనా (China)లో పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేసింది. స్టీరింగ్‌ ఆటోమేటిక్‌ అసిస్టెంట్‌, డోర్‌ లాకింగ్ వ్యవస్థ పనితీరులో లోపాలు తలెత్తిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనాలోని మార్కెట్‌ నియంత్రణ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బీజింగ్‌, షాంఘైలో విక్రయించిన 16 లక్షల టెస్లా కార్లలో తలెత్తిన లోపాలను రిమోట్‌ అప్‌గ్రేడ్‌ సాయంతో ఆ సంస్థే సరి చేస్తుందని తెలిపింది. కార్ల యజమానులు సర్వీస్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ సమస్యను మొత్తం నాలుగు రకాల కార్లలో గుర్తించారు. ఆగస్టు 26, 2014 నుంచి డిసెంబరు 20, 2023 వరకు విక్రయించిన మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌, మోడల్‌ 3, మోడల్‌ వై కార్లను రీకాల్‌ చేసినట్లు మార్కెట్‌ నియంత్రణ సంస్థ తెలిపింది. మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌లో 7,538 కార్లలో డోర్‌ లాక్‌ లాజిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో లోపాలున్నాయని, కారు ప్రమాదానికి గురైనప్పుడు డోర్ తెరుచుకోవడంలో సమస్య తలెత్తున్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో స్టీరింగ్‌ ఆటోమేటిక్‌ అసిస్టెంట్‌ వ్యవస్థలో తలెత్తే సమస్య కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో అమెరికాలో రెండు లక్షల కార్లను టెస్లా రీకాల్ చేసి డ్రైవర్‌ మానిటరింగ్ వ్యవస్థలోని లోపాలను సరిచేసింది.

* లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

వ‌చ్చేవారం కార్పొరేట్ సంస్థ‌ల తృతీయ త్రైమాసికం ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం వ‌రుస‌గా రెండో రోజు లాభాల‌తో ముగిశాయి. వాటిల్లో ఎల్ అండ్ టీ, రిల‌య‌న్స్‌, ఐటీ స్టాక్స్ లాభ‌ప‌డ్డాయి. శుక్ర‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 179 పాయింట్లు (0.25 శాతం) ల‌బ్ధితో 72,026 పాయింట్ల‌వ‌ద్ద ముగిసింది. మ‌రోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 21,711 పాయింట్ల వ‌ద్ద స్థిర ప‌డింది. టీసీఎస్‌, ఎల్ & టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్‌, హెచ్‌యూఎల్ లాభాలు గ‌డించ‌గా, నెస్ల్టే, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, స‌న్ ఫార్మా, ఏషియ‌న్ పెయింట్స్ న‌ష్టాల‌తో ముగిశాయి.ఎవ‌ర్ రెన్యూ ఎమ‌ర్జెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ నుంచి 225-వాట్ల ప‌వ‌న విద్యుత్ కొనుగోలు ఞ‌ప్పందం కుదుర్చుకోవ‌డంతో సుజ్లాన్ ఎన‌ర్జీ షేర్లు 5 శాతం పెరిగాయి. బీఎస్ఈ ఇండెక్స్‌లో 2,224 స్టాక్స్ లాభ ప‌డ్డాయి.ఆదాయం ప‌న్నుశాఖ రూ.4000 కోట్ల ప‌న్ను చెల్లించాల‌ని శ్రీ సిమెంట్ యాజ‌మాన్యానికి ఆదాయం ప‌న్ను శాఖ నోటీసు జారీ చేసింద‌న్న వార్త‌ల మ‌ధ్య శ్రీ సిమెంట్ షేర్లు 4.7 శాతం వ‌ద్ద మూత ప‌డ్డాయి. నిఫ్టీ ఐటీ 1.3 శాతం, నిఫ్టీ-ఆటో, నిఫ్టీ బ్యాంక్‌, మెట‌ల్‌, ఫార్మా, హెల్త్‌కేర్ స్టాక్స్ 0.10 లాభ ప‌డ్డాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z