Agriculture

ధరణిపై మరో కీలక నిర్ణయం

ధరణిపై మరో కీలక నిర్ణయం

ధరణిపై మరో కీలక నిర్ణయం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ధరణి రికార్డులను ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండగా, ఆ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టేందుకు కసరత్తు మొదలైంది. ధరణిలో 83 లక్షలకుపైగా వ్యవసాయ ఖాతాలు ఉన్నాయి. వీటితో పాటు నిషేధిత భూముల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సంబంధించిన భూములు సమాచారం ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ధరణి నిర్వహణ బాధ్యతలను టెర్రాసిస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఆ సంస్థను తప్పించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌), టీఎ్‌సటీఎస్‌ (తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌), సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)లలో ఏదో ఒక దానికి ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇటీవలే ఆయా సంస్థలను అధికారులు సంప్రదించినట్లు సమాచారం. వాస్తవానికి 2018లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఆర్‌ఎంఎ్‌స)కు సాఫ్ట్‌ వేర్‌ డిజైన్‌, డెవల్‌పమెంట్‌, ఇంప్లిమెంటేషన్‌ కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ)ను ఆహ్వానించింది. ఇందులో ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంట్‌ చేసుకుంది. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌) పేరును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 నవంబరు 2న ధరణి పోర్టల్‌గా మార్చింది.

ఈ ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ఐఎల్‌ఎ్‌ఫఎస్‌.. తమ కంపెనీకి చెందిన మెజారిటీ షేర్లను సింగపూర్‌కు చెందిన ఓ కంపెనీకి విక్రయించింది. ఆ షేర్లను కొనుగోలు చేసిన కంపెనీ టెర్రాసి్‌సగా పేరు మార్చుకొని ధరణి నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. అప్పటి నుంచి ఈ పోర్టల్‌ ద్వారానే భూములకు యాజమాన్యం హక్కులు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతల కాంట్రాక్ట్‌ (ఒప్పందం) గత ఏడాది సెప్టెంబరులో ముగిసినా.. మళ్లీ అదే సంస్థకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే, కోట్ల విలువ చేసే భూముల వివరాలు విదేశానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ చేతిలో ఉండడం అంత మంచిది కాదన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఈమేరకు ధరణి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకే అప్పగించాలని భావిస్తోంది. అలాగైతేనే.. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూరికార్డులు, రైతుల వివరాలు, ఇతర సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావుండదని అంచనా వేస్తోంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ధరణి ద్వారా జరిగే భూ క్రయవిక్రయాలు మినహా, మరే ఇతర కార్యకలాపాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 33 రకాల టెక్నికల్‌ మ్యాడ్యుల్స్‌ కింద వచ్చే దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తిగా ఆపేసింది. ఈ నేపథ్యంలోనే ధరణి పేరును భూమాతగా మార్చి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనసాగించాలని కాంగ్రెస్‌ సర్కార్‌ యోచిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z