కాలిఫోర్నియా హేవార్డ్‌లోని హిందూ ఆలయంపై దాడి జరిగింది. స్థానిక షేరావలి (దుర్గాదేవి) ఆలయంపై కొందరు దుండగులు.. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫెడరేషన్ (హెచ్‌ఏఎఫ్) ‘ఎక్స్’లో పేర్కొంది. ‘‘బే ఏరియాలోని మరో హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతు రాతలు రాశారు. హేవార్డ్‌లోని ది విజయస్ షేరావలి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం స్వామి నారాయణ్ ఆలయంపై దాడి, వారం క్రితం శివ్‌దుర్గ ఆలయంలో దొంగతనం తర్వాత ఇప్పుడీ ఘటన చోటు చేసుకొంది. ఆలయ పెద్దలతో, స్థానిక పోలీసులతో హెచ్‌ఏఎఫ్ టచ్‌లో ఉంది’’ అని పేర్కొంది.
ఖలిస్థానీల నుంచి ముప్పు పెరుగుతుండటంతో సెక్యూరిటీ కెమెరాలు, అలారమ్ బెల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హెచ్‌ఏఎఫ్ పేర్కొంది. అమెరికాలోని ఆలయ పెద్దలు హిందూ అమెరికన్ టెంపుల్ సేఫ్టీ గైడ్‌ను చూడాలని సూచించింది.
అక్టోబర్‌లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరం పార్క్‌వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలో హుండీ చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
👉 – Please join our whatsapp channel here