కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్ కథా చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్‌కు ధనుశ్ తన ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులతో పాల్గొనడం విశేషం. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్‌కు నివాళులు అర్పించాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేదికపై ధనుష్ మాట్లాడుతూ.. ‘చిన్న చినుకు పెను తుపాన్‌గా మారుతుందని అంటారని. అదేవిధంగా 2002లో చిన్న చినుకుగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఇప్పుడు పెను తుపాన్‌గా ఎదిగాను. ఇప్పుడు తాను సంపాదించుకున్న సొత్తు అభిమానులే అని పేర్కొన్నారు. ఇకపై ఈ చిత్రాన్ని చూస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రమ అన్నారు. దర్శకుడు అరుణ్ మాతీశ్వరన్ను చూస్తున్నప్పుడు తనకు వెట్రిమారన్ గుర్తుకు వస్తారన్నారు.
ఆయన మొదటిగా కలుసుకున్నప్పుడు ఈ తమ్ముడా దర్శకుడు అని అనిపించిందన్నారు. అయితే కథ విన్న 15 నిమిషాల తరువాత భారీ బడ్జెట్ అవుతుందిగా.. సాధ్యం అవుతుందా? అని అడిగానన్నారు. అందుకాయన అలాగే చేద్దామని చెప్పారన్నారు. ఇటీవల చిత్రాన్ని చూశానని ఆయన చెప్పినట్టుగానే ఉందని పేర్కొన్నారు. కెప్టెన్ మిల్లర్ విజయం సాధించడం తథ్యమని ధనుష్ పేర్కొన్నారు.
గౌరవమే స్వాతంత్య్రం అన్నది ఈ చిత్ర ట్యాగ్ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది. ఎవరికి స్వాతంత్య్రం ఉంది అన్నది తనకు తెలియడం లేదన్నారు. ఏం చేసినా ఆలోచించి చేయాల్సి వస్తుందని.. అలా ఆలోచించి చేసిన మంచి పనును కూడా తప్పు పట్టేందుకు ఒక వర్గం ఉండటమే స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. తన వరకు అది స్వాతంత్య్రం కాదని ధనుష్ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –