మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈసీ (EC) పర్యటనలు చేపట్టనుంది. తొలి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనుంది.
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన బృందం జనవరి 7 నుంచి రాష్ట్రాల్లో పర్యటించనుంది. తొలుత ఈసీ బృందం జనవరి 7 నుంచి 10వ తేదీ మధ్య.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి.. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈసీ బృందం రాష్ట్రాల పర్యటనకు ముందు.. వీరు ఎన్నికల సంఘానికి తమ నివేదికను ఇవ్వనున్నారు.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాల్లో పర్యటించడం సాధారణంగా ప్రతిసారీ జరిగే అధికారిక ప్రక్రియనే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసులు, పాలనా విభాగ అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఈసీ సమీక్షలు నిర్వహిస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ బృందం పర్యటించనుందా లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ఇటీవలే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో పర్యటన ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈసీ దేశవ్యాప్త పర్యటన పూర్తయిన అనంతరం.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముంది.
2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. మే 23న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –