హిందూ మహా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరం(Somalia s coast)లో ఈ ఘటన చోటుచేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది(Indian crew) ఉన్నట్లు అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది.
ఈ హైజాకింగ్ గురించి యూకే మారిటైమ్ ఏజెన్సీ( UKMTO)కి నౌక సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన భారత నౌకాదళం.. నౌక (MV LILA NORFOLK) గమనాన్ని సునిశితంగా పరిశీలిస్తోంది. సముద్రతీర గస్తీ కోసం కేటాయించిన ఐఎన్‌ఎస్ చెన్నైను రంగంలోకి దించింది. దీంతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపింది. ప్రస్తుతం నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. వారు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం వేళ ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో ఈ ఘటనలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భారత్ (India)కు వస్తున్న ఓ వాణిజ్య నౌక (Ship)పై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి (Drone Strike) జరిగింది. సమాచారమందుకున్న భారత నేవీ.. వెంటనే ‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని భారత నౌకాదళం వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –