Politics

నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా!

నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా!

రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జనసేనతో (Janasena) కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ (TDP) శ్రీకారం చుట్టింది. ‘రా.. కదలి రా..’ (Ra kadali Ra) పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా! అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైంది. ఈరోజు మీ అందరి సహకారం అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా! అని పిలుపునిస్తున్నా. నేను.. పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత.

‘రా కదలి రా’ కార్యక్రమాన్ని పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి ప్రారంభించాం. కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన అందరికీ అభినందనలు. కనిగిరి సభ ద్వారా పిలుపునిస్తున్నా.. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్‌ పాలన రావాలి’. అభివృద్ధి – సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్‌. గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడింది. మీకు ఇచ్చేది పది రూపాయలు అయితే.. దోచుకునేది వంద రూపాయలు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి, వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడం. కానీ, రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదు’’ అని విమర్శించారు.

ఎమ్మెల్యేలు.. ఎంపీలకు బదిలీలు ఉంటాయా?
‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే. ఒక్క ఛాన్స్‌ అన్నారని జగన్ మాయలో పడ్డారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్‌ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారు. పాలన సమర్థంగా ఉంటే కరెంట్‌ ఛార్జీలు పెంచే అవసరం లేదు. ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగింది. తెదేపా పాలనలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాలి. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండపిలో బంగారం అవుతుందా? మన రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్ కావాలని ప్రణాళికలు రచించాం. నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z